కార్యకర్తలు బలంగా ఉంటేనే పార్టీ బలంగా ఉంటుంది

Published: Monday September 06, 2021
రాష్ట్ర ఎస్ టి, మహిళ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్
బెల్లంపల్లి, సెప్టెంబర్ 5, ప్రజాపాలన ప్రతినిధి: కార్యకర్తలు స్థానికంగా బలంగా ఉంటేనే పార్టీ పటిష్టంగా ఉంటుందని రాష్ట్ర  ఎస్టీ, మహిళ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ఆదివారం నాడు స్థానిక వైష్ణవి ఫంక్షన్ హాల్లో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అధ్యక్షతన ఏర్పాటుచేసిన బెల్లంపల్లి నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తల, ప్రజా ప్రతినిధుల సమీక్ష సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొని ఆమె మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రమే ముఖ్య ఎజెండాగా 2001 ఎప్రిల్ 27వ తేదీన ఉద్యమ పార్టీగా అవతరించిన టిఆర్ఎస్ పార్టీ సుదీర్ఘ కాలంగా పోరాటం చేసి తెలంగాణ ప్రాంత ప్రజల చిరకాల కోరిక అయిన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిందని అన్నారు. టిఆర్ఎస్ పార్టీ, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆశీర్వాదంతో రెండు సార్లు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిందని అన్నారు. నూతనంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని రంగాల్లో అత్యద్భుతంగా అభివృద్ధి చేసి రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చే క్రమంలో తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశానికే రోల్ మోడల్ గా నిలిపారని పేర్కొన్నారు. పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ సంస్థాగత నిర్మాణంపైన ప్రత్యేక దృష్టి పెట్టి ప్రస్తుతం సుమారు 80 లక్షల సభ్యులను  పార్టీలో భాగస్వామ్యులను చేసి తెలంగాణ రాష్ట్రంలొనే అతిపెద్ద పార్టీగా నిలిపారని అన్నారు. అదేవిధంగా ఇటీవలనే దేశ రాజధాని ఢిల్లీలో పార్టీ కార్యాలయ నిర్మాణానికి భూమిపూజ చేయడం శుభసూచకమని పార్టీలో సభ్యత్వం కల్గిన ప్రతి ఒక్క కార్యకర్తకు గర్వకారణమని అన్నారు. అదేవిధంగా పార్టీ కోసం కష్టపడిన, కష్టపడుతున్న ప్రతీ కార్యకర్తను పార్టీ కడుపులో పెట్టుకుని కాపాడుకోవడమే కాకుండా ప్రతీ ఒక్క కార్యకర్తకు తప్పకుండా సముచిత స్థానం కల్పిస్తుందని తెలిపారు. అలాగే  పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు సెప్టెంబర్ 2వ తేదీ నుండి 12వ తేదీ వరకు గ్రామ మరియు వార్డు, అలాగే సెప్టెంబర్ 12వ తేదీ నుండి 20వ తేదీ వరకు మండల మరియు పట్టణ నూతన పార్టీ కమిటీలను ఏర్పాటుచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ టీ.సత్యనారాయణ, మంచిర్యాల జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రేణికుంట్ల ప్రవీణ్, బెల్లంపల్లి నియోజకవర్గంలోని 7 మండలాలకు చెందిన పార్టీ ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్ లు, వార్డుసభ్యులు, బెల్లంపల్లి మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, 7 మండలాల మరియు పట్టణ  పార్టీ అధ్యక్షులు, ఇతర ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, మహిళలు, అధిక సంఖ్యలో పాల్గొన్నారు.