ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రాస్తారోకో

Published: Saturday June 26, 2021

బెల్లంపల్లి, జూన్ 25, ప్రజాపాలన ప్రతినిధి : మంచిర్యాల జిల్లాకు మంజూరు చేసిన మెడికల్ కళాశాలను బెల్లంపల్లి లోనే ఏర్పాటు చేయాలని ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం నాడు బెల్లంపల్లి బజార్ ఏరియాలో రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ మెడికల్ కళాశాల ఏర్పాటుకు బెల్లంపల్లి అనువైన ప్రాంతమని ఆసిఫాబాద్ మంచిర్యాల రెండు జిల్లాల ప్రజలకు మధ్యలో బెల్లంపల్లి ఉంటుందని పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే అవకాశం ఉందన్నారు. గతంలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి హోదాలో బెల్లంపల్లి ఎన్నికల ప్రచార సభలో ముఖ్యమంత్రి కెసిఆర్ హామీ ఇచ్చిన విధంగా బెల్లంపల్లిలోనే మెడికల్ కళాశాల ఏర్పాటు చేయాలని అన్నారు. బెల్లంపల్లిలో ప్రభుత్వ భూములు సింగరేణి క్వార్టర్స్, కార్యాలయాలు,200 పడకల సామర్థ్యం గల సింగరేణి ఏరియా ఆసుపత్రి అందుబాటులో ఉందని, 40 శాతం నిర్మాణ పనులు పూర్తయిన పాత కెమికల్ భవనము అందుబాటులో ఉందని ఈ విద్యాసంవత్సరం మెడికల్ కళాశాల ప్రారంభించడానికి అనుకూలంగా బెల్లంపల్లి ఉందన్నారు. ఇప్పటికైనా అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి బెల్లంపల్లిలో మెడికల్ కళాశాల ఏర్పాటు చేసే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘాల నాయకులు బడికల శ్రావణ్, చిలుముల శ్రీకృష్ణదేవరాయలు, అల్లి సాగర్, నాయిని మురళిశ్రావణ్, ఆదర్స్ వర్ధన్ రాజు, బచ్చలి ప్రవీణ్, సోదై వినేష్, సంకీర్తన్, ఏముర్ల ప్రదీప్, మద్దెల శ్రీనివాస్, శివ, రాకేష్ పవన్, భాస్కర్ గౌడ్, జుబైద్, తదితరులు పాల్గొన్నారు.