దళితులను కొండ గిరిజనులుగా గుర్తించాలి

Published: Saturday June 11, 2022

భద్రాద్రి కొత్తగూడెం(ప్రజాపాలన బ్యూరో )మాల మహానాడు ముఖ్య కార్యకర్తల సమావేశం భద్రాచలం పట్టణంలోని స్థానిక అంబేద్కర్ సెంటర్ నందు శుక్రవారం మండల అధ్యక్షుడు పుట్టి రవి అధ్యక్షతన జరిగింది.ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు అల్లాడి పౌల్ రాజ్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాల కాలం గడిచిన ఏజెన్సీ ప్రాంతాల్లో నివాసముంటున్న ఎస్సీలకు ఎలాంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఉపయోగపడటం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.బ్రిటిష్ హయాంలో దళితుల అభివృద్ధి పేరుతో ఓ కమిటీ వేయడం జరిగిందని,1935వ సంవత్సరంలో ఆ కమిషన్ ఎస్సీలను కొండ గిరిజనులుగా గుర్తించిందని  ఆయన అన్నారు.దాని ప్రకారం ఎస్సీలను ఏజెన్సీ ప్రాంతంలో కొండ గిరిజనులుగా గుర్తించి అభివృద్ధిలో గిరిజనులతో పాటు భాగస్వాములు చేయాలని ఆయన కోరారు.స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు గడుస్తున్నా ఆ కమిటీ నివేదికను అమలు పరిచే ప్రభుత్వాలు లేకుండా పోవడం బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రకటించిన అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలలో దళితులకు సరైన సముచిత స్థానం లేకపోవడం,దళితులకు ఇస్తానన్న అనేక హామీలను అమలుపరిచ లేకపోవడం సరైంది కాదని ఆయన అన్నారు.అసలు ఏజెన్సీ ప్రాంతంలో దళితుల ఓట్లతో రాజకీయం చేసే ప్రభుత్వాలు దళితులను పట్టించుకోకపోవడం వారిని ఇంకా అంధకారంలోకి నెట్టడం సరైన పద్ధతి కాదని,ఇప్పటికైనా ప్రభుత్వాలు చిత్తశుద్ధితో ఏజెన్సీ దళితులను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో పుట్టి రవి,వర్ధన్,రాజేష్,శాంతి,సందీప్,మల్లయ్య,ఏసు,బన్నీ తదితరులు పాల్గొన్నారు.