జెరియాట్రిక్ కేర్ ప్రొవైడర్, కైట్స్ సీనియర్ కేర్ తెలంగాణకు కార్యకలాపాల విస్తరణ....

Published: Thursday March 30, 2023
హైదరాబాద్ (ప్రజాపాలన ప్రతినిధి ):
 
వృద్ధులకు సంరక్షణ సేవలను అందిస్తున్న   జెరియాట్రిక్ కేర్ ప్రొవైడర్ కైట్స్ సీనియర్ కేర్ నగరంలో కొత్త అత్యాధునిక సౌకర్యం తో సేవలను అందించడానికి సిద్ధమైందని సంస్థ ప్రతినిధులు తెలిపారు. (జెరియాట్రిక్) వయస్సు రీత్యా వచ్చే కొన్ని దీర్ఘకాల రుగ్మతలకు, కొన్ని రకాల శస్త్రచికిత్సల, జబ్బుల చికిత్సల తర్వాత అవసరమయ్యే సేవలు, ఆసుపత్రుల నుండి డిస్చార్జ్ అయిన తర్వాత పునరావాస సంరక్షణ, పాలియేటివ్ కేర్ , డిమెన్షియా కేర్‌లను కైట్స్ సీనియర్ కేర్ దాని ప్రత్యేక సంరక్షణ సౌకర్యాలతో కూడిన "ఆసుపత్రికి వెలుపల" సంరక్షణ సేవలను అందిస్తుందని, అదేవిధంగా వృద్ధుల ఇంటివద్ద కూడా సేవలను అందిస్తుందని సంస్థ ప్రతినిధులు వెల్లడించారు.
భారతదేశ జనాభాలో దాదాపు 11 శాతం మంది 65 ఏళ్లు పైబడిన వారు ఉన్నారని,2050 నాటికి భారతదేశ జనాభాలో 20 శాతం మంది 60 ఏళ్లు పైబడి ఉంటారని యు ఎన్ ఎఫ్ పి ఎ నివేదిక పేర్కొందన్నారు. వృద్ధుల సంరక్షణ కొరకై దేశం తన వృద్ధాప్య జనాభాను జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు.  కైట్స్ సీనియర్ కేర్ 2016లో సీనియర్ వైద్యులు, ఆరోగ్య సంరక్షణ నిపుణులచే స్థాపించబడిందన్నారు. కైట్స్ సీనియర్ కేర్ కో-ఫౌండర్, సివోవో & గ్రూప్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ రీమా నాడిగ్ మాట్లాడుతూ, “తమ ఆసుపత్రి బయట సంరక్షణ సౌకర్యాలు సంరక్షణ కార్యక్రమాలు వృద్ధుల నిర్దిష్ట అవసరాలకు అనుగుణంగా రూపొందించబడిందన్నారు. హైదరాబాద్‌లో 90 పడకలు, డేకేర్ కార్యకలాపాలను అందించడం ద్వారా వృద్ధులకు అత్యుత్తమ వృద్ధాప్య సంరక్షణను అందజేస్తుందని పేర్కొన్నారు.
 
కైట్స్ సీనియర్ కేర్ ఇటీవలే డాక్టర్ రంజన్ పాయ్ యొక్క మణిపాల్ ఎడ్యుకేషన్ & మెడికల్ గ్రూప్ ఫ్యామిలీ ఆఫీస్ నుండి యు ఎస్ డి 2 మిలియన్ల ప్రీ సిరీస్  ఫండింగ్‌ను పొందినట్లు ప్రకటించింది. కైట్స్ ఈ నిధులను బెంగళూరులో కార్యకలాపాలను అభివృద్ధి చేయడానికి, హైదరాబాద్ , చెన్నైలకు విస్తరించడానికి  సీనియర్ల ఆరోగ్య పర్యవేక్షణ & క్రియాశీల వృద్ధాప్యం కోసం సాంకేతిక వేదికను అభివృద్ధి చేయడానికి ఉపయోగిస్తుందని తెలిపారు.