గ్రామాభివృద్ధికి సత్యనారాయణ సేవలు మరువలేనివి

Published: Saturday November 27, 2021
పల్లె ప్రపంచం ఫౌండేషన్ అధ్యక్షుడు పల్లా కొండల రావు
బోనకల్, నవంబర్ 26 ప్రజాపాలన ప్రతినిధి: మండల పరిధిలోని చొప్పకట్లపాలెం గ్రామాభివృద్ధికి చలమల సత్యనారాయణ సేవలు చిరస్మరణీయంగా నిలచిపోతాయని పల్లె ప్రపంచం ఫౌండేషన్ అధ్యక్షులు పల్లా కొండల రావు తెలిపారు. గురువారం రాత్రి పల్లె ప్రపంచం ఫౌండేషన్ ఆధ్వర్యంలో చలమల సత్యనారాయణ 21వ వర్ధంతి సభ జరిగింది. రైతు సంఘం మండల నాయకుడు చలమల హరికిషన్ రావు అధ్యక్షతన జరిగిన సభలో ముందుగా మాజీ సర్పంచ్ బూసి వెంకటేశ్వర్లు సత్యనారాయణ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పల్లా కొండల రావు మాట్లాడుతూ సత్యనారాయణ మరణించి ఇరవై సంవత్సరాలు గడిచినా ఆయనను ప్రజలు మరిచిపోలేదంటే ఆయన చేసిన సేవలు, గడపిన ఆదర్శ జీవితం గ్రామ అభివృద్ధికి కారణమన్నారు. అన్నింటా విలువలు కోల్పోతు, గ్రామాలు దుర్భరంగా మారుతున్న తరుణంలో యువత సత్యనారాయణ జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని పల్లెల అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. సీపీఎం నాయకులు కిలారు సురేష్, టీఆర్ఎస్ నాయకులు తన్నీరు పుల్లారావులు మాట్లాడుతూ గ్రామంలో సత్యనారాయణ సహకారంతో చేసిన అభివృద్ధి కార్యక్రమాలను గుర్తు చేశారు. ప్రభుత్వ ఉద్యోగిగా పలు శాఖల్లో పనిచేస్తున్న సమయంలో కూడా నిజాయితీగా పనిచేసి పలువురి మన్ననలను పొందారన్నారు. తమ్మినేని వీరభద్రం, యలమంచిలి రాధాకృష్ణమూర్తి, బోడేపూడి వెంకటేశ్వరరావులు ప్రజాప్రతినిధులుగా ఉన్న సమయంలో వారి వద్ద పీఎ గా పనిచేసిన సమయంలో కూడా చొప్పకట్లపాలెం అభివృద్ధికి అనేకం పనులు చేయించారన్నారు. పల్లె ప్రపంచం ఫౌండేషన్ నాయకులు బోయినపల్లి అంజయ్య, కొండేటి అప్పారావు లు మాట్లాడుతూ గ్రామ అభివృద్ది కోసం సంస్థ చేస్తున్న కార్యక్రమాలకు గ్రామ ప్రజలు మరింతగా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు బొగ్గవరపు సోమయ్య, టీఆర్ఎస్ నాయకులు తన్నీరు కిషోర్, కావూరి నరసింహా రావు, వడ్డే నరేష్, మాజీ సర్పంచ్ బూసి వెంకటేశ్వర్లు, ఉపసర్పంచ్ బోయినపల్లి పున్నయ్య, బట్టు గోపాలరావు, చలమల అజయ్ కుమార్, రచ్చా శివరావు, బోయినపల్లి సూర్య నారాయణ, దారెల్లి ఆంజనేయులు, పొన్నం హర్షవర్ధన్, ఉన్నం వెంకటేశ్వర్లు, దరిశ రాము, బొప్పాల రమేష్, బాలు బోస్ తదితరులు పాల్గొన్నారు.