వైభవంగా అయ్యప్ప స్వామి పల్లివేట ఉత్సవం మధిర డిసెంబర్ 6, ప్రజా పలన ప్రతినిధి

Published: Wednesday December 07, 2022
మధిర పట్టణంలోని లడక బజార్లోని అయ్యప్ప నగర్ లో వేంచేసి ఉన్న శ్రీ  అయ్యప్ప స్వామి ఊరేగింపు ( పల్లి వేట ఉత్సవాన్ని )  మంగళవారం వైభవంగా నిర్వహించారు.గత నెల 30వ తేదీ నుండి ప్రారంభమైన ఉత్సవాలలో  భాగంగా అయ్యప్ప స్వామి ఉత్సవ విగ్రహాన్ని ప్రత్యేకంగా అలంకరించిన రథంపై ఉంచి అయ్యప్ప మాలదారులు, భక్తులు పురవీధుల్లో బాణాసంచ కలుస్తూ, డప్పు వాయిద్యాలు, కోలాట నృత్యాలతో స్వామివారిని ఘనంగా ఊరేగించారు.
 మధ్యాహ్నం  ప్రారంభమైన ఊరేగింపు పట్టణంలోని అన్ని ప్రధాన వీధులలో రాత్రి వరకు కొనసాగింది. రాత్రి స్వామి వారు తిరిగి ఆలయం వద్దకు చేరుకున్న అనంతరం స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని ఆలయ మండపంలో ఉంచి పల్లికురుప్పు  (శయ్య ) కార్యక్రమాన్ని నిర్వహించారు. స్వామి వారితోపాటు అయ్యప్ప మాలదారులు, భక్తులు ఆలయం మండపంలో నిద్ర చేశారు.
 అయ్యప్ప స్వామి ఊరేగింపు సందర్భంగా  స్థానిక లడక బజారుకు చెందిన  దేశభక్తి యువజన సంఘం, అయ్యప్ప భక్త బృందం  ఆధ్వర్యంలో ఆలయం వద్ద నుండి రైల్వే గేట్ వరకు కొబ్బరి మామిడి ఆకు తోరణాలతో అందంగా అలంకరించి భక్తులకు స్వాగత బ్యానర్లు ఏర్పాటు చేశారు.బ్రహ్మోత్సవాల ముగింపు సందర్భముగా బుధవారం స్వామివారికి ఆరట్టు  ( నదీ స్నానం) నిర్వహించనున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఉదయం తొమ్మిది గంటలకు ఆలయం వద్ద నుండి స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని వైరా నది వరకు ఊరేగింపుగా తీసుకువెళ్లి, నదీ స్నానం నిర్వహించి నది తీరం వద్ద విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం స్వామి వారికి అభిషేకించిన పసుపు, కుంకుమలను మహిళల సౌభాగ్యం కొరకు అందజేయడం జరుగుతుందన్నారు.
 అనంతరం ఆలయం వద్ద అయ్యప్ప లకు,  భక్తులకు మహా అన్నదానం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ అన్నదాన కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామి వారి ప్రసాదము స్వీకరించాలని ఆలయ నిర్వాహకులు ఈ సందర్భంగా కోరారు.