మొదటి విడతలో ఎంపికైన పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలి

Published: Wednesday May 18, 2022
వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల
వికారాబాద్ బ్యూరో 17 మే ప్రజా పాలన :
మన ఊరు - మన బడి కార్యక్రమంలో భాగంగా మొదటి విడతలో ఎంపికైన పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు త్వరగా పూర్తి చేసి పాఠశాలలు ప్రారంభం అయ్యే నాటికి విద్యార్థులకు కొత్త ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేందుకు సత్వర చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ నిఖిల సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం ధారూర్ మండలం, కుక్కింద గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చేపట్టనున్న పనులను కలెక్టర్ పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.  ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ మన ఊరు - మన బడి క్రింద కుక్కింద పాఠశాలకు మంజూరైన రూ.58 లక్షల రూపాయలతో అవసరమైన పనులు చేపట్టి  పాఠశాలలు పునఃప్రారంభం అయ్యే నాటికి అన్ని ఆధునికరణ పనులు పూర్తి చేయాలన్నారు.  పాఠశాలకు అవసరమైన డైనింగ్ హాల్, కిచెన్ షెడ్, ఫ్లోరింగ్, తలుపులు, త్రాగునీటి సదుపాయంతో పాటు అవసరమైన ప్రధాన మరియు ఇతర సుందరికరణ సాధారణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యా శాఖాధికారి రేణుక దేవి, మండల విద్యాధికారి బాబుసింగ్, పంచాయతీ రాజ్ డి. ఇ. శ్రీనివాస్, పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.