విద్యార్థుల వద్దకే సర్టిఫికెట్లు

Published: Tuesday December 14, 2021

ఎర్రుపాలెం డిసెంబర్ 13 ప్రజాపాలన ప్రతినిధి : కలెక్టర్ ఆదేశాలివ్వడంతో అన్ని చోట్లా కదిలిన రెవిన్యూ, సోషల్ వెల్ఫేర్ యంత్రాగం. ప్రత్యేక చొరవ తీసుకొని ముందుకు వెళ్తున్న ఎర్రుపాలెం తహసీల్దార్ డి.జగదీశ్వర ప్రసాద్. ఎర్రుపాలెం మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలో గల షెడ్యూల్డ్ క్యాస్ట్ విద్యార్థిని,విద్యార్థులకు ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ రిజిస్ట్రేషన్లో భాగంగా కుల ధ్రువీకరణ, ఆదాయ సర్టిఫికెట్లు తీసుకునేందుకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా, పాఠశాల్లో వారి స్టడీ సర్టిఫికేట్ ఆధారంగా పాఠశాల్లోనే ధ్రువీకరణ పత్రాలు ఇచ్చేవిధంగా తహసీల్దార్ డి.జగదీశ్వర ప్రసాద్ చర్యలు తీసుకుంటున్నారు. ఎర్రుపాలెం మండలంలో గల 54 ప్రభుత్వ పాఠశాలల్లో 1వ తరగతి నుండి 10వతరగతి వరకు చదువుతున్న షెడ్యూల్డ్ క్యాస్ట్ విద్యార్థులు మొత్తం 584 మంది ఉండగా ఇప్పటివరకు షుమారు 200 పైగా విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇచ్చామని, మిగిలిన విద్యార్థులకు ఆయా గ్రామాలలో గల పాఠశాలలోనే ఇచ్చేందుకు సిద్ధం చేస్తున్నామని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. ఇందుకోసం పాఠశాల ప్రధానోపాధ్యాయులు, మీసేవ, విఆర్ఎ, ఆర్ఐ మొదలగు సిబ్బందిని సమన్వయం చేశామని, ఈ అవకాశాన్ని విద్యార్థులు ఉపయోగించుకునేలా తల్లిదండ్రులు సహకారం అందించాలని ఆయన కోరారు. రెండు మూడు రోజులలో ఈ ప్రక్రియను పూర్తి చేస్తామని ఆయన ఈ సందర్బంగా తెలిపారు.