ఈ నెల 21న హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి

Published: Thursday August 18, 2022
మంచిర్యాల బ్యూరో, ఆగస్టు 17, ప్రజాపాలన:
 
స్వతంత్ర భారత వత్రోత్సవ మహోత్సవాన్ని పురస్కరించుకొని ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలలో భాగంగా ఈ నెల 21న నిర్వహించ తలపెట్టిన హరితహారం కార్యక్రమాన్ని అన్ని శాఖల అధికారులు, ప్రజాప్రతినిధుల సమన్వయంతో ప్రజల భాగస్వామ్యంతో విజయవంతం చేయాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, శాస్త్ర సాంకేతికత, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. బుధవారం అటవీ శాఖ ప్రత్యేక కార్యదర్శి శాంతకుమారితో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హరితహారం కార్యక్రమ నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి  మాట్లాడుతూ 
8వ విడత హరితహారం క్రింద జిల్లాలకు కేటాయించిన నిర్ధేశిత లక్ష్యాలను పూర్తి చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. గ్రామపంచాయతీ, మండల, జిల్లా కేంద్రాలలో మొక్కలు నాటడంతో పాటు మొక్కల సంరక్షణ ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకోవాలని తెలిపారు.
జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి మాట్లాడుతూ వజోత్సవ వేడుకలలో భాగంగా ఈ నెల 10న వనమహోత్సవంలో భాగంగా జిల్లాలో మొక్కలు నాటడం జరిగిందని, జిల్లాలో 8వ విడత హరితహారంలో 40 లక్షల మొక్కలు నాటడం లక్ష్యం కాగా ఇప్పటి వరకు 46 లక్షల మొక్కలు నాటడం జరిగిందని , అన్ని శాఖల సమన్వయంతో లక్ష్యాన్ని సాధించడం జరిగిందని తెలిపారు. ఈ నెల 21న జిల్లాలోని 311 గ్రామపంచాయతీలు, 7 పురపాలక సంఘాల పరిధిలో 50 వేల 250 మొక్కలు నాటేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి బి. శేషాద్రి, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.