ఇంటర్మీడియట్ విద్యలో జిల్లాను ప్రథమ స్థానంలో ఉంచాలి **

Published: Friday December 16, 2022
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ **
 
 ఆసిఫాబాద్ జిల్లా డిసెంబర్15 (ప్రజాపాలన,ప్రతినిధి) :ఇంటర్మీడియట్ విద్యలో ఆసిఫాబాద్ జిల్లాను రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉంచే విధంగా అధ్యాపకులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని జనకాపూర్ రైతు వేదికలో జిల్లా అదనపు కలెక్టర్ చాహత్ బాజ్పాయి,జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి శ్రీధర్ సుమన్ తో కలిసి జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాల్, అధ్యాపకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గత సంవత్సరం ఇంటర్మీడియట్ విద్యలో మన జిల్లా 2వ స్థానంలో నిలిచిందని, ఇదే స్ఫూర్తితో మరింత కృషిచేసి ప్రథమ స్థానంలో సాధించే విధంగా అధ్యాపకులు దృష్టి సారించాలని తెలిపారు. నాణ్యమైన విద్య బోధిస్తూ వారి పఠన సామర్థ్యం పెరిగే విధంగా కృషి చేయాలని తెలిపారు. వార్షిక పరీక్షలకు విద్యార్థులను సన్నద్ధం చేయాలని, ప్రణాళికాబద్ధంగా సిలబస్ పూర్తి చేయడంతో పాటు రివిజన్ చేయించి ఉత్తమమైన ఫలితాలు సాధించే దిశగా దృష్టి సారించాలని తెలిపారు. విద్యార్థులకు క్రమశిక్షణ అలవాటు చేసి సత్ప్రవర్తన తీసుకురావాలని తెలిపారు. స్టడీ అవర్స్ నిర్వహించాలని, విద్యార్థులు 100 శాతం హాజరు ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఇంటర్ పూర్తి అయిన తర్వాత ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉన్న రంగాలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని, ఎస్సీ, ఎస్టి, విద్యార్థులు
దూర ప్రాంతాల నుంచి కళాశాలలకు వచ్చే వారిని ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రత్యేక తరగతులు నిర్వహించాలని, ప్రతి కళాశాలలో విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అందించడం జరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో కళాశాలల ప్రిన్సిపాల్స్, అధ్యాపకులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.