అధికారుల సమన్వయంతో ప్రజావాణి సమస్యల పరిష్కారం. జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి

Published: Tuesday September 06, 2022
మంచిర్యాల బ్యూరో, సెప్టెంబర్ 5, ప్రజాపాలన  :
 
ప్రజావాణి కార్యక్రమంలో అర్జీదారుల నుండి స్వీకరించిన దరఖాస్తుల పరిష్కారంపై సంబంధిత శాఖల అధికారుల సమన్వయంతో కృషి చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవనంలో అర్జీదారుల నుండి దరఖాస్తులు స్వీకరించారు. లక్షెట్టిపేట మండలంలోని గూడెం గ్రామానికి చెందిన కానగంటి సుమలత తాము లింగయ్య వద్ద 1 ఎకరం 1 గుంట భూమిని కొనుగోలు చేశామని, ముటేషన్ కొరకు దరఖాస్తు చేసుకోగా రికార్డులలో లింగయ్యకు 25 గుంటలు మాత్రమే ఉందని, ఇరిగేషన్ కొరకు 2011లో 16 గుం॥ల భూమి తీసుకోగా, రెండవ సారి సైతం తీసుకున్నట్లుగా చూపుతున్నారని, దీనిపై విచారణ జరిపి న్యాయం చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకున్నారు. జన్నారం మండలం మొర్రిగూడ గ్రామానికి చెందిన బదావత్ జ్యోతి తనకు కళ్యాణలక్ష్మీ అందించాలని కోరుతూ దరఖాస్తు చేసుకున్నారు. మంచిర్యాల పట్టణం రాంనగర్ ప్రాంతానికి చెందిన బొమ్మిదేని లక్ష్మీ తాను రెండు పడక గదుల పథకంలో దరఖాస్తు చేసుకోగా ఇందిరమ్మ ఇల్లు కలిగి ఉన్నట్లు చూపుతుందని, గతంలో ఇందిరమ్మ ఇంటి కొరకు దరఖాస్తు చేసుకున్నప్పుడు ఆన్లైన్ మంజూరైనట్లుగా పేరు వచ్చినప్పటికీ నాకు స్థలం చూపెట్టలేదని, నిరుపేద అయిన తనకు రెండు పడక గదుల పథకంలో ఇల్లు మంజూరు చేయాలని కోరుతూ అర్జీ సమర్పించారు. కాసిపేట మండలం ట్యాంక్ ్బస్తీకి చెందిన సాంబారి నవీన శ్రీ తాను వికలాంగురాలినని, బి.ఎస్.సి. (ఎన్) చదివిన తనకు బస్తీ దవాఖానలో ఉద్యోగం కల్పించిన ఆదుకోవాలని కోరుతూ దరఖాస్తు సమర్పించారు. వేమనపల్లి మండలం దస్నాపూర్, కొత్తపల్లి గ్రామానికి చెందిన రైతులు తమకు 2007-08లో అసైన్మెంట్ పట్టాలు ఇవ్వడం జరిగిందని, ఆన్లైన్ చేసినప్పుడు మోకాపై ఉన్న పట్టాదారులను తొలగించి ఇతరులకు పట్టాదారు పాస్ పుస్తకాలు మంజూరు చేయడం జరిగిందని, ఈ కారణంగా అసలు పట్టాదారులమైన మాకు ప్రభుత్వం వచ్చే రైతుబంధు, పంట రుణాలు ఇతరత్రా నష్టపోతున్నామని, దీనిపై విచారణ జరిపి న్యాయం చేయాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తులను ఆయా సంబంధిత అధికారుల సమన్వయంతో పరిష్కారం దిశగా కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.