సొంత భవన నిర్మాణానికి సహకరించండి - ముఖ్యమంత్రి కెసిఆర్ కు గ్రేటర్ రాయలసీమ వాసుల విజ్ఞప్తి

Published: Monday February 27, 2023
హైదరాబాద్ (ప్రజాపాలన ప్రతినిధి ): 
 
అత్యంత వెనుకబడిన ప్రాంతమైన రాయలసీమ ప్రాంతం నుంచి జీవనోపాధి కోసం తెలంగాణ కు వలస వచ్చిన రాయలసీమ వాసుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని సొంత భవన నిర్మాణానికి సహకరించాలని గ్రేటర్ రాయలసీమ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ (జి ఆర్ ఎ టి) సీఎం కేసీఆర్ కు విజ్ఞప్తి చేసింది. ఆదివారం పంజాగుట్ట లోని జి ఆర్ ఎ టీ కార్యాలయంలో అసోసియేషన్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రాఘవ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, విశ్రాంత న్యాయమూర్తి లక్ష్మణ రెడ్డి, మాజీ ఐపీఎస్ అధికారి హనుమంత రెడ్డిలతో పాటు ఆ ప్రాంతానికి చెందిన వైద్యులు, ఇంజనీర్లు, ప్రభుత్వ ఉద్యోగులు హాజరయ్యారు. తమ ప్రాంత వెనుకబాటుతనం, వలసలు, ఇతర అంశాలపై సమావేశంలో చర్చించారు.  ఈ సందర్భంగా అసోసియేషన్ నూతనంగా రూపొందించిన వెబ్సైట్,  సోషల్ మీడియా ప్లాట్ ఫాం, జి ఆర్ ఎ టి బిజినెస్ నెట్వర్క్ ఫోరం లను అతిథులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలోనే అత్యంత వెనుకబడిన ప్రాంతంగా రాయలసీమ పేరొందిందని అన్నారు. ఇప్పుడిప్పుడే అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్న ప్రాంతవాసులు వ్యక్తులుగా అభివృద్ధి సాధిస్తూ ఇతరులకు తోడ్పాటు అందించాలని సూచించారు. ఐక్యంగా ఉంటూ స్థానిక ప్రభుత్వాల సహాయ సహకారాలు తీసుకొని ముందుకు సాగాలని కోరారు. తెలంగాణ ప్రాంతంలో సుమారు 15 లక్షల మంది రాయలసీమ వాసులు జీవనం సాగిస్తున్నారని అలాంటి వారి సంక్షేమం అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని ఇక్కడి ప్రభుత్వం సహకారం అందించడంతోపాటు అభివృద్ధికి బాటలు వేయాలని కోరారు.