జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా

Published: Tuesday September 21, 2021

కూకట్ పల్లి: (ప్రజాపాలన) దీర్ఘకాలంగా అపరిషృతంగా జర్నలిస్టుల డిమాండ్ లను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టి డబ్ల్యూజె ఎఫ్) రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డిమాండ్లతో కూడిన బ్యానర్లు, ప్లకార్డులను ప్రదర్శిస్తూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. అనంతరం జిల్లా అదనపు కలెక్టర్ ఏనుగు నరసింహారెడ్డి కు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా ఫెడరేషన్ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత జర్నలిస్టుల సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదని ఆవేదన వక్తం చేశారు. ముఖ్యంగా జిల్లాలో అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ళు లేదా ఇళ్ళస్థలాలివ్వాలని ఎన్నో రోజులుగా అడుగుతున్న ప్రభుత్వం స్పందించడం లేదని విమర్శించారు. చాలా మంది జర్నలిస్టులు సొంత ఇళ్ళు లేక అద్దె ఇళ్లలో ఉంటూ ఆర్ధిక ఇబ్బందులతో సతమతమవుతున్నారని అన్నారు. విలేకరిగా పని చేస్తున్న ప్రతి ఒక్కరికీ అక్రిటేషన్ కార్డు ఇవ్వాలని కోరారు.  జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని, ఇందులో భాగంగా జర్నలిస్టు తీన్మార్ మల్లన్న పై పోలీసుల వేధింపులు ఆపాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టులపై దాడుల నిరోధానికి జిల్లా, రాష్ట్రస్థాయి కమిటీలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కరోనాతో చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలను ఆదుకోవాలని వారు కోరారు. ఒక్కో కుటుంబానికి రూ. 25 లక్షల ఆర్ధిక సహాయం అందించాలన్నారు. కరోనా పాజిటివ్ ఉన్న జర్నలిస్టులకు వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టులందరికీ హెల్త్ కార్డులు ఇవ్వాలని, ఇచ్చిన హెల్త్ కార్డులు అన్ని ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రుల్లో పని చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. అదే విధంగా చిన్న పత్రికలు, కేబుల్ టీవీ, వెబ్ చానళ్ళను ప్రభుత్వం గుర్తించి ప్రోత్సహించాలని వారు కోరారు. రాష్ట్రస్థాయి మీడియా కమీషన్ ఏర్పాటు చేయాలని, జర్నలిస్టుల రక్షణకు ప్రత్యేక చట్టం చేయాలని కోరారు. మీడియా అకాడమీకి బడ్జెట్ పెంచాలని, సమాచార శాఖకు పూర్తి స్థాయి కమీషనర్ నియమించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఐఎఫ్ డబ్ల్యూ జె) జాతీయ కౌన్సిల్ సభ్యులు మెరుగు చంద్రమోహన్,  రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు బెలిదే అశోక్ గుప్తా, రాష్ట్ర కార్యవర్గసభ్యులు ఎంపల్లి పద్మారెడ్డి, జిల్లా అధ్యక్షులు తన్నీరు శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి యవాపురం రవి, జిల్లా కోశాధికారి మండపాక కళ్యాణ చక్రవర్తి, కూకట్ పల్లి నియోజకవర్గ అధ్యక్షులు ఎం.మహేశ్వర్ రెడ్డి, ఉపాధ్యక్షులు ఎస్. శ్రావణ్ కుమార్, ట్రెజరర్ హెచ్.నరేష్, యూనియన్ సభ్యులు డి.విజయ్, శ్యామ్ సుందర్, ఆకుల సుధాకర్, లక్ష్మణాచారి, రాజు రెడ్డి, బి.ఎస్. శివకుమార్, చంద్రకాంత్,రవీందర్, వెంకటేష్. కుత్బుల్లాపూర్ నియోజకవర్గ అధ్యక్షులు గడ్డమీది అశోక్, ప్రధాన కార్యదర్శి సురేష్ గౌడ్, మేడ్చల్ నియోజకవర్గ అధ్యక్షులు బూర శ్రీధర్, ప్రధాన కార్యదర్శి యాట రాజు, జిల్లా ఉపాధ్యక్షులు పటేల్ నరసింహ, సహాయ కార్యదర్శి టి.రమేష్, గుమ్మడి హరిప్రసాద్ జిల్లా మహిళా నాయకురాలు హనుమాన్ రాజమణి, ఈ.మంజుల, ఎం.రజిని, గుమ్మడి రోజారాణి, వట్టిపల్లి సురేష్, పరశురాం యం.విష్ణు మోహన్, కోట్ల రాజు తదితరులు పాల్గొన్నారు.