పులుమద్ది గ్రామంలో అక్షరాభ్యాసం

Published: Tuesday June 21, 2022
సర్పంచ్ తిమ్మాపురం మాధవరెడ్డి
వికారాబాద్ బ్యూరో జూన్ 20 ప్రజాపాలన : నేటి బాలలను భావిభారత పౌరులుగా తీర్చిదిద్దేందుకు ఉపాధ్యాయులు అహర్నిశలు కృషి చేయాలని పులుమద్ది గ్రామ సర్పంచ్ తిమ్మాపురం మాధవరెడ్డి పిలుపునిచ్చారు. సర్కారు బడులు కార్పోరేట్ బడులకు ఏ మాత్రం తీసిపోని విధంగా విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని ఆకాంక్షించారు. సోమవారం వికారాబాద్ మండల పరిధిలోని పులుమద్ది గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో అక్షరాభ్యాస కార్యక్రమంలో భాగంగా 23 మంది విద్యార్థులకు శ్రీకారంతో అక్షరాభ్యాసం చేయించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ నేటి సమాజానికి అనుకూలమైన విద్యను సర్కారు బడుల్లో అందించగలిగితే ప్రైవేట్ పాఠశాలల గడప తొక్కరని విశ్వాసం వ్యక్తం చేశారు. సర్కారు బడుల్లో చదివే ప్రతి పిల్లవాడు పేద కుటుంబం నుంచి వచ్చిన వారేనని గుర్తు చేశారు. సర్కారు బడుల్లోని నాణ్యమైన విద్యను చూసి ప్రతి తల్లిదండ్రి అబ్బుర పడాలని స్పష్టం చేశారు. విషయ పరిజ్ఞానంలో ఎంతో విజ్ఞానాన్ని సంపాదించిన ఉపాధ్యాయులు తమ విద్యార్థులను తమకంటే ఉన్నతులుగా తీర్చిదిద్దాలని కోరారు. నేటి చిన్నారులకు క్రమశిక్షణతో కూడిన నాణ్యమైన విద్యను అందించాలని సూచించారు. సర్కారు బడుల్లో మౌలిక వసతులతో పాటు విద్యార్థులకు ఉచితంగా యూనిఫామ్ పాఠ్యపుస్తకాలు కల్పిస్తుం
డడంతో ఈ అవకాశాన్ని తల్లిదండ్రులు అందిపుచ్చుకోవాలని హితవుపలికారు. మొక్కై వంగనిది మానై వంగుతుందా అని సభా వేదికగా చమత్కరించారు. బాల్యములో నేర్పిన విద్యనే అతని భవిష్యత్తుకు పునాదిగా మారుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో చైల్డ్ లైన్ కోఆర్డినేటర్ బోయిని శ్రీనివాస్ ముదిరాజ్, ప్రధానోపాధ్యాయులు శ్రీలత, ఎస్ఎంసి చైర్మన్ రాజు, ఉపాధ్యాయులు, అంగన్వాడీ టీచర్లు కవిత, రేణుక, తల్లిదండ్రులు పాల్గొన్నారు.