పట్టణ ప్రగతి పనులు వేగం పెంచాలి

Published: Wednesday March 31, 2021
సమీకృత మార్కెట్ లను 6 నెలల్లో పూర్తి చేయాలి 
మునిసిపాలిటీ లలో ప్రధాన జంక్షన్ ల అభివృద్ధి 
సెంట్రల్ లైటింగ్,పచ్చదనం పై ప్రత్యేక దృష్టి 
15 రోజుల్లో ఒక్కో మునిసిపాలిటీ పై ప్రత్యేక సమీక్ష 
విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
వికారాబాద్ జిల్లా ప్రతినిధి మార్చి 30 ( ప్రజా పాలన ) : ఇంటిగ్రేటెడ్ మార్కెట్ లు త్వరితగతిన పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అదేశించారని, అందుకనుగుణంగా చర్యలు తీసుకోవాలని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులకు ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల పట్టటణ ప్రగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలోని 4 మునిసిపాలిటీలలో ఇప్పటికే స్థలాలు గుర్తించటం జరిగిందన్నారు. మార్కెట్ కు వచ్చే కొనుగోలు దారులకు ప్రశాంత వాతావరణంలో అన్ని సరుకులు ఒకే దగ్గర కొనుగోలు చేసేలా ఉండాలన్నారు. ఇప్పటికే గజ్వేల్ లో నిర్మితమైన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ను నూతనంగా ఎన్నికైన మార్కెట్ చైర్మన్ లు, కమిషనర్ లు, ఎమ్మెల్యేలతో కలిసి సందర్శించడం జరిగిందన్నారు. అన్ని రకాల కూరగాయలు, ధాన్యం, పూలు, పండ్లు, వెజ్, నాన్ వెజ్ లాంటి అన్ని ఒకే దగ్గర లభించేలా ఈ మార్కెట్ లు ఉంటాయన్నారు. తినే పదార్థాలను ఎక్కడ పడితే అక్కడ అమ్మకుండా, ఒక స్వచ్చమైన స్థలంలో ఉంచటమే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమన్నారు. పట్టణాల్లోనే ముందు 500 కోట్లతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మునిసిపాలిటీలలో సమీకృత మార్కెట్ లు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. ప్రతి మునిసిపాలిటీలో డంపింగ్ యార్డ్, వైకుంఠదామాలను కూడా యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. చెత్త తరలింపు ఆటోలు ఇప్పటికే అన్ని మునిసిపాలిటీలలో అందుబాటులోకి వచ్చాయన్నారు. వికారాబాద్ మునిసిపాలిటీలో ఎన్టిఆర్, బిజెఆర్ జంక్షన్ లను అభివృద్ధి పర్చాలని, మంత్రి పేర్కొన్నారు. తాండూరు, పరిగి, కొడంగల్ మునిసిపాలిటీలలో కూడా ప్రధాన జంక్షన్లు ఆధునికరించాలని, మొక్కలు నాటాలని వాటితో ప్రకృతి శోభ వెల్లివిరియాలని మంత్రి పేర్కొన్నారు. సెంట్రల్ లైటింగ్ తో పాటు పట్టణంలో హరితహారంకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. వికారాబాద్ శివారెడ్డి పెట్ చుట్టూ మినీ ట్యాంక్ బండ్ నిర్మాణానికి సంబంధించి కార్యాచరణ రూపొందించాలని మంత్రి సూచించారు. మేకల అంగడి కోసం గిరిగిట్ పల్లిలో 5 ఎకరాల స్థలం కేటాయించినట్లు తెలిపారు. 15 రోజుల్లో మరొక సారి ఈ అంశాలపై ఒక్కో మునిసిపాలిటీపై ప్రత్యేకంగా సమీక్ష నిర్వహిస్తామని మంత్రి పేర్కొన్నారు. పట్టణ ప్రగతిలో భాగంగా దృష్టిలోకి వచ్చిన అన్ని సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. తాండూరు, పరిగిలలో డ్వాక్రా బజార్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. వికారాబాద్ లో పారిశుద్ధ్య కార్మికుల వేతనాలపై ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ మంత్రి దృష్టికి తీసుకురాగా వెంటనే మునిసిపల్ శాఖ డైరెక్టర్ సత్యనారాయణతో ఫోన్ లో మాట్లాడారు. జీతాలు వెంటనే విడుదల అయ్యేలా చూడాలని, కలెక్టర్ తో సమన్వయం చేసుకోవాలన్నారు. పట్టణ ప్రగతి కింద ప్రతి నెల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మునిసిపాలిటీ లకు 148 కోట్ల నిధులు నేరుగా వస్తున్నాయన్నారు. టియూఎఫ్ఐడిసి కింద వికారాబాద్ కు20 కోట్లు, తాండూరు కు 25 కోట్లు, పరిగి కి 15 కోట్లు, కొడంగల్ మునిసిపాలిటీ కి 15 కోట్లు నిధులు కేటాయించడం జరిగిందన్నారు. 75 కోట్లతో సాగుతున్న టియూఎఫ్ఐడిసి పనులు త్వరగా పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. మరుగుదొడ్లను కూడా వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ పౌసుమి బసు, ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్, పైలట్ రోహిత్ రెడ్డి, మహేష్ రెడ్డి, విద్యా మౌలిక సదుపాయాల సంస్థ చైర్మన్ నాగేందర్ గౌడ్, అడిషనల్ కలెక్టర్ చంద్రయ్య, మునిసిపల్ చైర్మన్ లు, కమిషనర్ లు పాల్గొన్నారు.