గణతంత్ర వేడుకలకు ప్రజాప్రతినిధులు దూరం...!

Published: Friday January 27, 2023
* జిల్లా కలెక్టర్ వైఖరి నచ్చక గణతంత్ర వేడుకలకు జిల్లా నేతలు దూరం
వికారాబాద్ బ్యూరో 26 జనవరి ప్రజా పాలన : వికారాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో గురువారం జరిగిన 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు వికారాబాద్ జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులు దూరంగా ఉన్నారు. జిల్లాస్థాయి వేడుకలకు జిల్లాలోని ప్రజా ప్రతినిధులు హాజరవుతారు. కానీ గురువారం నాడు జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఒక్క ప్రజా ప్రతినిధి కూడా హాజరు కాకపోవడం గమానార్హం. వికారాబాద్ జిల్లా నుంచి జిల్లా పరిషత్ చైర్పర్సన్ పట్నం సునీతా రెడ్డి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ సభ్యుడు పట్నం మహేందర్ రెడ్డి, వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్, తాండూర్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి, పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి, కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి తో పాటు చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డీసీబీ చైర్మన్ మనోహర్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజు గౌడ్ ప్రభుత్వ కార్యక్రమాలకు హాజరవుతారు. కానీ గురువారం కలెక్టరేట్లో జరిగిన గణతంత్ర వేడుకలకు అధికార పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు అందరు దూరంగా ఉండడం పట్ల పలు అనుమానాలకు తావిస్తోంది. ప్రజా ప్రతినిధులు ఎవరు రాకపోవడంతో వేదికపై జిల్లా కలెక్టర్ నిఖిల, జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ, జిల్లా అదనపు ఎస్పీ రషీద్, డిఆర్ఓ అశోక్ కుమార్ తదితర అధికారులు మాత్రమే వేదికపై ఉన్నారు. జిల్లా కలెక్టర్ నిఖిల, జిల్లా ప్రజా ప్రతినిధుల మధ్య సఖ్యత సక్రమంగా లేకపోవడంతోనే ఇలా జరుగుతున్నట్లు పలువురు అభిప్రాయపడుతున్నారు. గతంలో జరిగిన పలు జిల్లా స్థాయి ప్రభుత్వ కార్యక్రమాలకు జిల్లా కలెక్టర్ నిఖిల హాజరు కాకపోవడం పట్ల జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల జిల్లా పరిషత్ చైర్పర్సన్ సునీతా మహేందర్ రెడ్డి కలెక్టర్ అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్న ఈ కలెక్టర్ మాకు వద్దంటూ  బహిరంగంగా  మీడియా ముఖంగా ఆరోపించారు. కలెక్టర్ వ్యవహార శైలి బాగాలేదని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్తానని ఆమె పేర్కొన్నారు. జిల్లాలో అభివృద్ధి పనులు ఆశించిన మేరకు జరగాలంటే జిల్లా కలెక్టర్ జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధుల  మధ్య సయోధ్య సక్రమంగా ఉండాలి. ఇప్పటికైనా జిల్లా అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని జిల్లా కలెక్టర్, ప్రజా ప్రతినిధులు తమ తమ వైఖరులను మార్చుకొని జిల్లా అభివృద్ధికి బాటలు వేయాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.