ముదిరాజుల హక్కుల సాధనకు కృషి చేద్దాం

Published: Monday October 18, 2021
జిల్లా ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు రామన్నగారి శ్రీనివాస్ ముదిరాజ్
వికారాబాద్ బ్యూరో 17 అక్టోబర్ ప్రజాపాలన : ముదిరాజుల హక్కులను సాధించే వరకు ఉద్యమిద్దామని జిల్లా ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు రామన్నగారి శ్రీనివాస్ ముదిరాజ్ పిలుపునిచ్చారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఎన్టిఆర్ కూడలిలో ముదిరాజ్ శతజయంతి ఉత్సవాలలో భాగంగా జిల్లా ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కృష్ణస్వామి ముదిరాజ్ జన్మతహా గొప్పనాయకత్వ లక్షణాలు మూర్తీభవించిన మహనీయుడని కొనియాడారు. కృష్ణస్వామి ముదిరాజ్ మొదటి నుంచీ తాను పుట్టిన ముదిరాజ్ కులం బాగోగుల గురించే కాకుండా ఇతర పేదకులాల గురించి తపనపడేవాడని స్మరించారు. 1917లో హైదరాబాద్ నగరాన్ని విషజ్వరాలు పీడించినప్పుడు ఆయన నగరవాసులకి ఎనలేని సేవలు చేశాడని గుర్తు చేశారు. 'సోషల్ సర్వీస్ కాన్ఫరెన్స్' అనే సంస్థ సభ్యుడై సమాజ సేవ చేశాడని పేర్కొన్నారు. తెలంగాణ వ్యాప్తంగా అనేక గ్రంథాలయాలు నెలకొల్పి, విద్యావ్యాప్తికి విశేషంగా కృషిచేశాడని స్పష్టం చేశారు. ఆయన హైదరాబాద్ కార్పొరేషన్ కు మేయర్ స్థాయిలో పనిచేశాడని వివరించారు. ఆంధ్రప్రదేశ్ లో చెల్లా చెదురై ఉన్న ముదిరాజులను ఏకం చేయడానికి కృష్ణస్వామి ఆంధ్రప్రదేశ్ ముదిరాజ్ మహాసభను స్థాపించాడు. కృష్ణస్వామి ముదిరాజ్ 1893 సెప్టెంబర్ 3న బిజుబాయి ఎల్లయ్యలకు జన్మించారన్నారు. మాజీ రాష్ట్ర అధ్యక్షులు కీ.శే. నవాడ ముత్తయ ముదిరాజ్ చిన్న వయస్సులో తల్లితండ్రులు మరణించడం వలన వీరి తాత గారైన నవాద రామన్న తోడ్పాటుతో కుటుంబం బాధ్యతలు తన పై వేసుకొన్నారని తెలిపారు. నవాడ ముత్తయ్య పూజ్య బాపుజీని ఆదర్శంగా తీసికొని హరిజన, గిరిజన, బహుజన పేద ప్రజలకు సేవలను అందించుకుంటూ ఏన్నో పాఠశాలలు స్థాపించాడని పేర్కొన్నారు. మాతృభాష అభివృద్ధికి ఆర్థిక, సాంఘిక అభ్యున్నతికై సమాజ సేవచేస్తూ ముదిరాజుల ఐక్యత కొరకు ముదిరాజ్ మహాసభ ద్వారా 1982 దసరా సమ్మేళనం ఏర్పాటు చేశాడన్నారు. దసరా అయిన మొదటి ఆదివారం శ్రీ శ్రీ సత్యనారాయణ వ్రతం ఏర్పాటు చేసి ముదిరాజ్ బంధవులను ఏకంచేసేవాడని వివరించారు. ముదిరాజ్ బంధు మిత్రుల సమస్యల పరిష్కారానికి సూచనలు తీర్పులు చేప్పెవారన్నారు. కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ నిర్మించిన ముదిరాజ్ భవన్, న్యూబోయిగూడ, సికింద్రాబాద్ లో నిర్విరామంగా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతాయన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి కల్ఖోడ నర్సిములు, జిల్లా ఉపాధ్యక్షుడు శాకం రాములు, నియోజకవర్గ అధ్యక్షుడు బిఆర్ శేఖర్, సీనియర్ నాయకుడు దుద్యాల వెంకటయ్య, పట్టణ అధ్యక్షుడు లక్ష్మణ్, శివారెడ్డిపేట్ పిఏసిఎస్ చైర్మన్ గడ్డమీది పాండు, నియోజకవర్గ అధ్యక్షుడు ఆర్.నర్సిములు, కాకి రంగరాజు, జైదుపల్లి గ్రామ అధ్యక్షులు జి.కిష్టయ్య, గోపాల్, జిల్లా లీగల్ అడ్వైజర్ దుద్యాల లక్ష్మణ్, రామయ్య, వెంకటయ్య, జి.నర్సిములు, బాలనర్సిములు తదితరులు పాల్గొన్నారు.