ఏఐకెఎస్ జిల్లా సహాయ కార్యదర్శిగా జక్కుల రామారావు

Published: Thursday December 02, 2021
బోనకల్, డిసెంబర్ 1 ప్రజాపాలన ప్రతినిధి: మండల కేంద్రంలో జరిగిన ఏ ఐ కె ఎస్ జిల్లా ఇరవై మహాసభల్లో బోనకల్ మండలం గోవింద పురం (ఎల్) గ్రామానికి చెందిన జక్కుల రామారావు మరోసారి జిల్లా సహాయ కార్యదర్శిగా ఎన్నికయ్యారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన మూడు నెలలకే నాగార్జునసాగర్ జలాలను మండలంలోని పలు గ్రామాలకు విడుదల చేయకుండా ఆంధ్ర ప్రాంతానికి తీసుకు వెళ్తున్నప్పుడు రైతులతో కలిసి పోరాటం చేసిన రామారావు అరెస్టయి పదకొండు రోజులపాటు జైలు జీవితం గడిపారు. అదే తెలంగాణా రాష్ట్రంలో మొదటి సంకెళ్ళుగా అప్పట్లో రాష్ట్రంలో సంచలనాన్ని సృష్టించింది. మండలంలోని లక్ష్మీపురం, గోవిందాపురం, ఆల్లపాడు, మోటమర్రి తదితర గ్రామాల్లో మొక్కజొన్న, మిర్చి నకిలీ విత్తనాల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవడానికి అలుపెరగని పోరాటం చేసి రైతులకు నష్టపరిహారం అందించేందుకు కృషి చేశారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన విషయంలో రైతులకు అందాల్సిన నష్టపరిహారంకై హైదరాబాదులో జరిగిన పోరాటంలో పాల్గొని సఫలీకృతుడయ్యాడు. సుబాబు రైతులకు ధరల పెంచాలన్న ముఖ్య ఉద్దేశం తో సాగిన రెండు రోజుల పోరాటం తో పాటు ఐ టి సి లో జరిగిన చర్చల్లో పాల్గొని సుబాబుల్ రైతులకు న్యాయం చేకూరేలా చేశాడు. రామారావు ఎన్నికతో మండలంలోని రైతు నాయకులు, రైతులు, వివిధ పార్టీల నాయకులు హర్షాన్ని వ్యక్తం చేశారు. నన్ను ఏ ఐ కె ఎస్ జిల్లా సహాయ కార్యదర్శిగా నియమించినందుకు సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు తోట రామాంజనేయులు, మండల కార్యదర్శి ఆనందరావు, జిల్లా సమితి సభ్యులు తూము రోషన్ కుమార్, ఏ ఐ కే ఎస్ నాయకులు పారుపల్లి నరసింహారావు, ఏలూరు పూర్ణచంద్రరావు గ్రామ శాఖ నాయకులు రామారావుకు అభినందనలు తెలియజేశారు. రైతుల పక్షాన పోరాడటానికి అనునిత్యం అందుబాటులో ఉంటానని రామారావు ఈ సందర్భంగా తెలియజేశారు.