తాండూర్ పట్టణం ఇంద్రానగర్ లో నిత్యావసర వస్తువులు పంపిణీ

Published: Wednesday October 26, 2022
 రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్త వాజీద్
వికారాబాద్ బ్యూరో 25 అక్టోబర్ ప్రజా పాలన : సంపాదించిన దాని‌లో నుండి ఎంతో కొంత బీదసాదలకు చేయూతనివ్వడమే లక్ష్యంగా కృషి చేస్తున్నానని రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్త వాజిద్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీద వారికి ఉచితంగా గత 2 సంవత్సరాలుగా నిత్యవసర వస్తువులను పంపిణీ చేస్తున్నానని పేర్కొన్నారు. పేదవారి ఆకలి తీర్చేందుకు నా వంతు ప్రయత్నం కొనసాగిస్తున్నానని స్పష్టం చేశారు. ఆకలితో అలమటించే పేద ప్రజల కడుపు నింపేందుకు చిరు ప్రయత్నమే నా సంతోషాన్ని రెట్టింపు చేసిందన్నారు. మానవ జన్మనెత్తిన మనిషి తాను సంపాదించిన దాంట్లో ఎంతో కొంత తోటి వారికి సహాయం చేయడం మహదానందాన్ని ఇస్తుందని వివరించారు. నేటి మానవులు సంపాదనే పరమార్థంగా భావించి తమ జీవితంలో శాంతి సౌభాగ్యాలను కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎందరెందరో ఎంతో డబ్బులు కూడా పెట్టినా తోటి వారిని ఆదుకునేందుకు ముందుకు రాకపోవడం శోచనీయమని అన్నారు. మానవ జన్మ ఎత్తినందుకు సార్థకత చేకూరేందుకు తన తోటి వారికి సహాయం చేయాలనే లక్ష్యంతో కృషి చేస్తున్నానని వెల్లడించారు. అత్యధిక సంపన్నులు నేను చేసే సహాయంతో ప్రేరణ కలగాలని ఆకాంక్షించారు. గత రెండు సంవత్సరాలుగా తాండూరులో  ప్రతినెల ఉచితంగా రేషన్ వస్తువులు నిత్యావసర వస్తువులను పంపిణీ చేస్తున్నానని వివరించారు. ప్రతి నెల అవసరమయ్యే సరుకులను పంపిణీ చేస్తూ పేదల కడుపు నింపుతున్ననందుకు నా  ఆనందాన్ని రెట్టింపు చేసిందన్నారు. కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ విధించడంతో ప్రజలు నిత్యావసర వస్తువుల కొరకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని చెప్పారు. కరోనా కష్టకాలంలో ప్రజలకు కావలసిన నిత్యావసరాల వస్తువులను పంపిణీ చేశానని హర్షం వ్యక్తం చేశారు. 80 కుటుంబాలకు నిత్యవసర వస్తువులను పంపిణీ చేశానని గుర్తు చేశారు. పేదవారికి తన వంతుగా సహాయం చేయడం ఆత్మసంతృప్తినిస్తుందని, దేవుని దయవల్ల తాను రియల్ ఎస్టేట్లో సంపాదించిన దాని నుండి పేదలకు సహాయం చేస్తున్నా నని అన్నారు. ఈ కార్యక్రమంలో ముఫ్థి బద్రుద్దీన్ , ఉర్దూ ex తాండూర్ ఛైర్మన్ సలీం , అబ్దుల్ అహెమద్  పాషా , అబ్దుల్ ఖయ్యూం తదితరులు పాల్గొన్నారు.