వెనుకబడిన వర్గాలను ఏకం చేసి రాజ్యాలను పాలించిన గొప్ప నాయకుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ - జ

Published: Saturday August 20, 2022

జగిత్యాల, ఆగస్టు 18 (ప్రజాపాలన ప్రతినిధి): జగిత్యాల పట్టణంలో సర్దార్ సర్వాయి  పాపన్న గౌడ్ 372 వ జయంతి వేడుకలలో  జగిత్యాల జిల్లా పరిషత్ చైర్మన్  దావ వసంతసురేష్, కలెక్టర్ జి.రవి, జిల్లా గ్రంధాలయ సంస్థ ఛైర్మెన్ డా. చంద్రశేఖర్ గౌడ్, అడిషనల్ కలెక్టర్ లత పాల్గొన్నారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్మన్  మాట్లాడుతూ
గత ప్రభుత్వాలు పాపన్నను చరిత్రలో లేకుండా చేశాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాలతో పాపన్న జయంతిని ప్రభుత్వం ఆద్వర్యంలో నిర్వహిస్తుంది. ఆనాటి సమాజంలో నెలకొన్న నిరంకుశ రాజరిక పోకడలకు వ్యతిరేకంగా సబ్బండ వర్గాలను ఏకం చేసి, పాపన్న పోరాడిన తీరు గొప్పదని పేర్కొన్నారు. సర్వాయి పాపన్న గౌడ్ జయంతి ఉత్సవాలను, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తూ బడుగు బలహీన వర్గాల నాయకత్వాన్ని సముచితంగా గౌరవించుకుంటున్నదని అన్నారు. లండన్ లోని కేంబ్రిడ్జి విశ్వ విద్యాలయంలో పాపన్న విగ్రహం ఏర్పాటు చేయడంతో పాటు చరిత్రనుపొందుపర్చారు. కుల వృత్తుల పై ఆధారపడి జీవిస్తున్న వారు ఆత్మగౌరవంతో బతకాలనేది ప్రభుత్వ లక్ష్యం అన్నారు.  ఈ కార్యక్రమంలో జిల్లా మరియు వివిధ మండలాల గౌడ్ సంఘం అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.