ప్రతి ఇంటికి సరిపడా మిషన్ భగీరథ నీరు అందించాలి : వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్

Published: Wednesday August 03, 2022
వికారాబాద్ బ్యూరో 02 ఆగస్టు ప్రజా పాలన : ప్రతి ఇంటికి సరిపడా మిషన్ భగీరథ నీళ్లు అందించాలని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ సంబంధిత అధికారులకు సూచించారు. మంగళవారం ధారూర్ మండల పరిధిలోని హరిదాసుపల్లి గ్రామంలో వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ *"మీతో నేను"* కార్యక్రమంలో మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రాజు నాయక్ ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్ అనిత బుచ్చయ్యతో కలిసి వీధి వీధి తిరిగి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో సరిపడా మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదని ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. స్పందించిన ఎమ్మెల్యే రెండు నెలలుగా నీటి సరఫరా ఆగిపోతే మిషన్ భగీరథ అధికారులు ఏం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మిషన్ భగీరథ అధికారులు వెంటనే హరిదాసుపల్లి గ్రామాన్ని సందర్శించి, సమస్యలు పరిష్కారం చేయాలని సూచించారు. మిషన్ భగీరథ నీరు రాలేని సమయంలో కచ్చితంగా ప్రత్యామ్నాయంగా నీరు అందించే ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. గ్రామంలోని పిచ్చి మొక్కలు వెంటనే తొలగించాలని స్పష్టం చేశారు. శానిటేషన్ సరైన పద్దతిలో లేదని, పల్లె ప్రగతిలో ఏం చేశారని ప్రశ్నించారు. పంచాయతీ కార్యదర్శి అధికారుల పై  ఆగ్రహం వ్యక్తం చేశారు. మళ్ళీ శానిటేషన్ సమస్యలు పునరావృతం ఐతే కఠిన చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు.  గ్రామంలో థర్డ్ వైర్ ఏర్పాటు చేసి, గ్రామంలో పంటపొలాల్లో వేలాడుతున్న విద్యుత్ వైర్లను సరిచేయాలని తెలిపారు. నూతన ట్రాన్స్ఫర్మర్ ఏర్పాటు చేసి గ్రామాల్లో విద్యుత్ అంతరాయం లేకుండా సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతి ఇంటికి మరుగుదొడ్డి నిర్మించుకోవాలని, వాటిని వాడుకలో పెట్టుకోవాలని, బహిరంగ మల విసర్జన చేయరాదని ప్రజలకు సూచించారు.
గ్రామంలో అత్యవసర నీటి సరఫరాకు చేతి పంపులు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. వర్షాకాలం సందర్భంగా గ్రామంలో పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకొని, తగు జాగ్రత్తలు తీసుకోవాలని, అనారోగ్యాలకు గురికారాదని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసి చైర్మన్ ముచ్చర్ల సంతోష్ కుమార్ గుప్తా టిఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి కావలి అంజన్న ముదిరాజ్ మండల టిఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షుడు కోస్నం వేణుగోపాల్ రెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్ రాములు ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు మరియు తదితరులు పాల్గొన్నారు.