కంటి వెలుగు శిబిరాలను విజయవంతంగా నిర్వహించాలి

Published: Friday January 13, 2023
* రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు
వికారాబాద్ బ్యూరో 12 జనవరి ప్రజా పాలన : జిల్లాలో కంటి వెలుగు శిబిరాలను విజయవంతంగా నిర్వహించేందుకు ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు జిల్లా కలెక్టర్ లను ఆదేశించారు.  గురువారం  మంత్రి హరీష్ రావు వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ రిజ్వి, కమిషనర్ శ్వేత లతో కలిసి కంటి వెలుగు క్యాంపుల నిర్వహణ పట్ల తీసుకోవాల్సిన చర్యలపై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం  అత్యంత ప్రతిష్టాత్మకంగా కంటి వెలుగు కార్యక్రమాన్ని అమలు చేస్తుందని, ఈ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలని మంత్రి సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏ చిన్న పొరపాటు జరగకుండా, అధికారులు అప్రమత్తంగా ఉంటూ కార్యక్రమాన్ని వంద శాతం విజయవంతం చేయాలని మంత్రి కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా క్యాంపులను ఏర్పాటు చేసి 100 పని దినాలలో నిర్వహించేందుకు పక్కా ఏర్పాట్లు చేయాలని అన్నారు.  జిల్లాలలో ఉన్న వైద్య బృందాలు సమీప పట్టణాలు, మండల హెడ్ క్వార్టర్ లలో నైట్ హాల్ట్ చేసేలా కలెక్టర్ లు చర్యలు తీసుకోవాలని, ఉదయం 8-45 వరకు తప్పనిసరిగా బృందాల సభ్యులు క్యాంపు లోకేషన్ చేరుకోవాలని మంత్రి స్పష్టం చేశారు. కంటి వెలుగు క్యాంపులు విజయవంతం అయ్యేందుకు పంచాయతీ కార్యదర్శులను, అంగన్వాడి టీచర్లు, ఆశా కార్యకర్తలు,  ఆర్.పి లు, విఒఏలను భాగస్వామ్యం చేయాలని, క్యాంపు నిర్వహణ ముందస్తు సమాచారం ప్రజలకు తెలియజేసి భారీ సంఖ్యలో పాల్గోనేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. ప్రతి గ్రామ సంఘాలను భాగస్వామ్యం చెస్తూ పూర్తి స్థాయిలో వృద్ధులు పాల్గోనేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. ప్రతి వైద్య బృందానికి క్యాంపు నిర్వహణ కోసం అవసరమైన సామాగ్రి, మందులు, కళ్ళద్దాలు అందించేలా చర్యలు తీసుకోవాలని, మండల స్థాయిలో, మున్సిపల్ స్థాయిలో సమావేశాలు నిర్వహించి  క్యాంపు వివరాలను ప్రజలకు తెలియజేయాలని, ప్రజలకు కంటి వెలుగు ఆహ్వన పత్రికలు అందేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. జిల్లాలో ఉన్న రేషన్ షాపుల వద్ద కంటి వెలుగు శిబిరాల సమాచారం తెలియజేస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని, పట్టణాలలో ముఖ్యమైన కూడళ్ళలో హోర్డింగులు ఏర్పాటు చేయాలని అన్నారు.
గ్రామాల్లో క్యాంపుల నిర్వహణ కంటే ముందుగా సంబంధిత ఆశా, ఎఎన్ఎం లు పర్యటించి షెడ్యూల్ వివరాలు తెలియజేస్తూ కంటి వెలుగు పై అవగాహన కల్పించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు.  జిల్లాలో ఉన్న ఎంపీడీవోలు  ఎంపిఒ, తహసిల్దార్ లు, మండల ప్రత్యేక అధికారి ప్రతి రోజూ వారి పరిధిలో గల క్యాంపులను తనిఖీ చేయాలని, జిల్లా స్థాయిలో డిఎంహెచ్ఓ, ఇతర ప్రోగ్రాం అధికారులు విస్తృతంగా పర్యటిస్తూ క్యాంపుల నిర్వహణను తనిఖీ చేయాలని మంత్రి ఆదేశించారు. జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్లు వారి పర్యటనల సమయంలో కంటి వెలుగు క్యాంపులను రెగ్యులర్ గా తనీఖీ చేయాలని మంత్రి కోరారు. వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ నిఖిల మాట్లాడుతూ, జిల్లాలో 42 బృందాల ద్వారా కంటి వెలుగు నిర్వహిస్తున్నామని, మరో రెండు బఫర్ టీంలు కూడా ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు.   అవసరమైన సామాగ్రి అందుబాటులో ఉందని, జిల్లాకు ఇప్పటి వరకు 39 వేల 767 రీడింగ్ గ్లాసెస్ చేరాయని, అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో మండల స్థాయి మున్సిపల్ స్థాయి కోఆర్డినేషన్ సమావేశాలు నిర్వహించడం జరిగిందని మరికొన్ని గ్రామపంచాయతీ పరిధిలో ఈరోజు సమావేశాలు నిర్వహించి పూర్తి చేయడం జరుగుతుంది అన్నారు. వాట్సాప్ గ్రూపులు ఏర్పాటుచేసి పనులను పర్యవేక్షించడం జరుగుతుందని, కంటి వెలుగు టీములకు అవసరమైన ఉత్తర్వులు కూడా ఈరోజు అందజేయనున్నట్లు కలెక్టర్ తెలియజేశారు. ఈనెల 17న ట్రయల్ రన్ కూడా నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు.ఈ వీడియో కాన్ఫరెన్స్ లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ, జిల్లా రెవెన్యూ అధికారి అశోక్ కుమార్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పాల్వన్ కుమార్, జడ్పి సి ఈ ఓ జానకి రెడ్డి,  జిల్లా పంచాయతి అధికారి తరుణ్ కుమార్, డి ఆర్ డి ఓ కృష్ణన్, డి ఈ ఓ రేణుక దేవి, మున్సిపల్ కమిషనర్లు  సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
వీడియో కాన్ఫరెన్స్ అనంతరం కలెక్టర్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో సంబంధిత అధికారులతో కంటి వెలుగు శిబిరాల నిర్వహణపై జిల్లా కలెక్టర్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, అన్ని గ్రామ పంచాయతీలలో గ్రామ కార్యదర్శులు, అంగన్వాడి, ఆశా వర్కర్లతో పాటు ప్రజా ప్రతినిధులు, రేషన్ షాప్ డీలర్లను భాగస్వాములు చేస్తూ సమన్వయ సమావేశాలు నిర్వహించి అవగాహన కల్పించాలన్నారు.  కంటి వెలుగు శిబిరాల వద్ద టెంట్లు, చైర్స్, టేబుల్స్, త్రాగునీరు, విద్యుత్తు తదితర అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. క్యాంపుల నిర్వహణ సమయంలో విద్యుత్తు సరఫరాలో  అంతరాయం లేకుండా విద్యుత్ శాఖ అధికారులు చర్యలు చేపట్టాలన్నారు.  వైద్య బృందాలకు మండల హెడ్ క్వార్టర్లలో బస చేసే విధంగా వసతి కల్పించాలని, అలాగే టీములకు వాహనాలు ఏర్పాటు చేయాలని సూచించారు. క్యాంపుల నిర్వహణకు  42 టిమ్ ల అధికారులకు విధులు నిర్వర్తించే విధంగా వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని అన్నారు. కంటి వెలుగు క్యాంపుల వద్ద అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. గ్రామాలలో ఏ తేదీ నుండి ఏ తేదీ వరకు క్యాంపులు నిర్వహిస్తారో అట్టి వివరాలు సిద్ధం చేసి ప్రజలకు ముందస్తుగా తెలియపరచాలన్నారు. వాట్సాప్ గ్రూపులో ఏర్పాటు చేసుకొని పనులను పర్యవేక్షించాలి అన్నారు. ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహన కల్పించి ముసలి, పేద ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని క్యాంపుల ద్వారా లబ్ధి పొందేలా చూడాలని అన్నారు.