కబ్జా కోరల్లో సిద్దులూరు పాయగా భూమి

Published: Wednesday October 27, 2021
వికారాబాద్ బ్యూరో 26 అక్టోబర్ ప్రజాపాలన : ప్రభుత్వ భూమిని కాపాడాల్సిన అధికారులే నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు. రాజకీయ నాయకులకు వత్తాసు పలుకుతూ కాసుల మత్తులో ఊరేగుతున్నారు. ప్రభుత్వ భూములను కాపాడాల్సిన పూర్తి బాధ్యత ప్రభుత్వ అధికారులు కొంగజపం నటిస్తున్నారు. కాసులు అందజేస్తే వందల ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా రాయుళ్ళకు అప్పనంగా అందించడానికి వెనుకాడడం లేదు. వికారాబాద్ మండల పరిధిలోని కొటాలగూడ గ్రామానికి అనుబంధ గ్రామంగా లాల్సింగ్ తండా ఉన్నది. ఈ రెండు గ్రామాల రెవెన్యూ భూములు సిద్దులూరు పాయగా పిలువబడతాయి. కొటాలగూడ గ్రామంలోని అత్యధిక ప్రజలు ఎస్సీ ఎస్టీ బీసీ సామాజిక వర్గాలకు చెందిన వారే ఎక్కువ. ప్రజలందరూ వ్యవసాయమే జీవనాధారంగా చేసుకొని బతుకు బండిని లాగుతున్నారు.  వ్యవసాయంతో పాటు కూలీ పనులు చేసుకుంటూ తమ కుటుంబాలను పోషించుకుంటున్నారు. కొటాలగూడ గ్రామంలోని చాలా మంది కుటుంబాలకు స్వంతంగా పట్టా భూములు లేవు. పట్టా భూమి లేని నిరుపేద రైతులకు ప్రభుత్వం మంచి ఉద్దేశంతో గత 40 సంవత్సరాల క్రితం సిద్దులూరు పాయగాకు సంబంధించిన సర్వే నంబర్లు 176, 263 లలో గల ప్రభుత్వ భూమిని ఒక్కొక్క కుటుంబానికి సుమారుగా మూడు ఎకరాల చొప్పున పంపిణీ చేసింది. ఈ భూములలో వ్యవసాయం సాగు చేసుకుంటూ జీవనం గడపడానికి గొర్రెలు మేకలు మేపుకునే వారు. కొటాలగూడ గ్రామ అభివృద్ధిలో భాగంగా రోడ్లు, ఇళ్ల నిర్మాణానికి కావలసిన ఎర్ర మట్టిని ఈ భూములలో నుండి తీసుకొని ఉపయోగించుకుంటారు. సినిమా ఇండస్ట్రీ వాళ్లు కూడా ఈ ప్రాంతంలో సినిమా షూటింగ్ లు చేయడానికి వస్తూ ఉంటారు. గ్రామ పంచాయతీకి సుమారుగా 2 నుండి 5 లక్షల వరకు సినిమా షూటింగ్ వాళ్ళు ఇచ్చి అనుమతి తీసుకుంటారు. సినిమా షూటింగ్ వాళ్ళు ఇచ్చే డబ్బులతో దేవాలయం నిర్మాణానికి, గ్రామాభివృద్ధికి వినియోగించేవారు. సుఖసంతోషాలతో జీవిస్తున్న కొటాలగూడ గ్రామ రైతుల జీవితాలలో స్థానిక రాజకీయ ప్రతినిధుల అత్యాశను ఆసరాచేసుకొని హైదరాబాద్ నగరానికి చెందిన కబ్జా రాయుల్ల కన్నుపడి అక్రమంగా తిష్ఠవేశారు. నిరుపేదలకు ఇచ్చిన ప్రభుత్వ భూమిలో వ్యవసాయం చేయనివ్వకుండా భౌతిక దాడులకు దిగుతూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. భూముల విలువ పెరగడంతో కబ్జారాయుళ్లు ఆడింది ఆటగా పాడింది పాటగా ముందుకు సాగుతున్నారు. వీరికి గ్రామ పెద్దలుగా చలామణి అవుతున్న రాజకీయ నాయకుల అండదండలు పుష్కళంగా ఉన్నాయని గ్రామ ప్రజలు తెలుపుతున్నారు. వందల ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జాకోరల్లో చిక్కింది. సాగు చేసుకుంటున్న వ్యవసాయ భూమిని పేద రైతులకు లక్ష, రెండు లక్షల రూపాయలు ముట్టజెప్పి భూమిని లాక్కుంటున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 
అక్రమార్కుల అఘాయిత్యాలు :
రైతులకు ఇచ్చిన భూమిని ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుందని, రైతులకు ఇచ్చిన భూమిని మాజీ సైనికులకు ప్రభుత్వం ఇచ్చిందని, రైతులకు ఇచ్చిన భూమిపై ఎన్ఓసి ఇచ్చిందని, ఈ భూములను వదిలి పెట్టి వెళ్ళకపోతే పోలీసు కేసులు పెడతామని, ఈ భూముల వ్యవహారంపై గ్రామంలోని ఎవరైనా ఫిర్యాదు చేస్తే వారిపై కూడా కేసులు నమోదు చేయిస్తామని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. 
సిద్దులూరు పాయగాకు చెందిన భూముల గురించి ఫిర్యాదు :
రైతులకు ఇచ్చిన ప్రభుత్వ భూములను అన్యాయంగా, అక్రమంగా, అధర్మంగా వ్యవహరిస్తూ దర్జాగా కబ్జా చేసుకుంటున్నట్లు ఎంఆర్ఓకు, ఆర్డీఓ కు, జిల్లా అదనపు కలెక్టరుకు, జిల్లా కలెక్టరుకు ఫిర్యాదు చేసినా స్పందన అరణ్య రోదన అయ్యింది.  
రోడ్డు పాలైన నిరుపేద మహిళా కుటుంబాలు :
కొటాలగూడ గ్రామానికి చెందిన గౌండ్ల నాగమణి లచ్చన్నోల్ల లక్ష్మి ల కుటుంబాలకు ప్రభుత్వం ఇచ్చిన భూమిని కబ్జాదారులు ఆక్రమించడంతో రోడ్డుపాలయ్యారు. వీరి భర్తలు చనిపోవడంతో కుటుంబ భారాన్నంతా మోస్తూ కాలం వెల్లదీస్తున్నారు. గౌండ్ల నాగమణికి ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు ఉన్నారు. లచ్చన్నోల్ల లక్ష్మికి ఇద్దరు కుమారులు ఒక కుమార్తె ఉన్నారు. ప్రభుత్వం ఇచ్చిన భూమిలో వ్యవసాయంతో పాటు కూలీనాలీ చేస్తూ తమ పిల్లల్ని పోషించుకుంటున్నారు. ఉన్న భూమిని భూ ఆక్రమణదారులు ఆక్రమించుకోవడంతో మాకు చావు తప్ప మరో మార్గం లేదని కన్నీటి పర్యంతం అవుతున్నారు. సంబంధిత రెవెన్యూ అధికారులు, జిల్లా అధికారులు, గ్రామ పెద్దలుగా చలామణి అవుతున్న మనస్సు కరిగి నిరుపేద కుటుంబాలను ఆదుకుంటారని ఆశిద్దాం.