ఏజెన్సీ ప్రాంతాలలో గిరిజనేతరులకు న్యాయం చేయాలి

Published: Thursday March 25, 2021

ఎం ఎస్పి జిల్లా కన్వీనర్ పూల బోయిన మొండయ్
ఆసిఫాబాద్ జిల్లా, మార్చి24 (ప్రజాపాలన ప్రతినిధి): జిల్లాలో ఏజెన్సీ ప్రాంతాలలో నివసిస్తున్న గిరిజనేతరులకు న్యాయం చేయాలని మహాజన సోషలిస్ట్ పార్టీ (ఎం ఎస్ పి) జిల్లా కన్వీనర్ పూల బోయిన మొండయ్య కోరారు. జిల్లా కేంద్రంలో బుధవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మొండయ్య మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతాలలో గిరిజనులు కాకుండా గిరిజనేతరులు అనేకమంది నివశిస్తున్నారన్నారు. వీరంతా తమ ఆస్తులకు సంబంధించి సరైన భద్రత లేకపోవడంతో ఎప్పుడు ఏం జరుగుతుందో నని ఆందోళనలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నుండి వీరికి ఎలాంటి భద్రతా పరమైన చర్యలు చేపట్టకపోవడం శోచనీయం అని అన్నారు. జిల్లాలో అనేక ప్రాంతాలు ఏజెన్సీ చట్టాల కింద ఉన్నాయని వాటిలో 50 శాతం పైగా బీసీ, మైనారిటీ, ఓసి, కమ్యూనిటీలు, ఉన్నాయని, అయినప్పటికీ అక్కడ భూములపై ఆస్తుల అమ్మకాలపై కేవలం ఎస్టీ లకు మాత్రమే అధికారాలు ఉండటం ఏమిటని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం దీనిపై సరైన చర్యలు తీసుకొని ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజన రైతులకు రక్షణ కల్పించాలని కోరారు, ఈ కార్యక్రమంలో ఎం ఎస్ పి జిల్లా కో కన్వీనర్ భీమ్ రావు, ఎం ఎస్ పీ కోఆర్డినేటర్ రేగుంట మహేష్, నాయకులు చందు, బక్కయ్య, తదితరులు ఉన్నారు.