దళితుల జీవితాల్లో వెలుగులు నింపే గొప్ప పథకం

Published: Wednesday February 09, 2022
విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
వికారాబాద్ బ్యూరో 08 ఫిబ్రవరి ప్రజాపాలన : దళిత బంధు దళితుల జీవితాల్లో వెలుగులు నింపే గొప్ప పథకమని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మంగళవారం దళిత బంధు, మన ఊరు మన బడి పథకాలపై వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన సమీక్ష సమావేశానికి విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ దళితులను సమాజంలో ఉన్నతంగా ఎదగడానికి, వారు ఆర్థికంగా బలోపేతం కావటానికి దేశంలో ఎక్కడా లేని దళిత బంధు పథకం తీసుకువచ్చారని కొనియాడారు. రాష్ట్రంలో దళిత బంధుకు ముఖ్యమంత్రి కేసీఆర్ 1200 కోట్ల నిధులు విడుదల చేశారని పేర్కొన్నారు. గ్రామం, మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయి కమిటీలు వేయాలని సూచించారు. మార్చి 5 వరకు అన్ని నియోజకవర్గాల్లో ఈ ప్రక్రియ పూర్తి కావాలని స్పష్టం చేశారు. మండల స్థాయిలో ముందు అవగాహన సమావేశాలు ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం నియోజకవర్గానికి చెందిన 100 మంది లబ్దిదారులతో సమావేశాలు నిర్వహించాలని చెప్పారు. అధికారులు సూచిస్తున్న యూనిట్ల తో పాటు వినూత్న ఆలోచనలతో కూడా పెట్టొచ్చని, దళిత బంధు నిధులు సక్రమంగా వినియోగించుకొని, ఆర్థికంగా లాభపడాలని వివరించారు. ఇద్దరు, ముగ్గురు లబ్ధిదారులు కలిసి పెద్ద పెద్ద వ్యాపారాలు కూడా చేసుకునే అవకాశం ఉంటుందని గుర్తు చేశారు. నియోజకవర్గానికి ఒక ప్రత్యేక అధికారి నియామకం జరుగుతుందన్నారు. ఎలాంటి వాయిదాలు చెల్లించకుండా పూర్తి సబ్సిడీతో దళిత బంధు పథకం కింద నేరుగా లబ్ధిదారులకు పది లక్షలు వారి ఖాతాలో జమ అవుతాయని అన్నారు. రక్షణ నిధిలో భాగంగా లబ్దిదారుని నుండి 10 వేలు, ప్రభుత్వం పది వేలు జమ చేసి, భవిష్యత్తుకు రక్షణగా ఉంటుందని తెలిపారు. భవిష్యత్తులో మరో ఇద్దరికి ఉపాధి కల్పించేలా లబ్ధిదారులు ఎదగాలని హితవు పలికారు. ప్రస్తుతం పైలట్ ప్రాజెక్ట్ గా నియోజకవర్గానికి 100 మందికి, రానున్న బడ్జెట్ తర్వాత 2 వేల మంది వరకు ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారని పేర్కొన్నారు. అందరూ లబ్ధిదారులు ఒకే రకమైన స్కీం వైపు వెళ్లకుండా అనేక రకాల వ్యాపారాలు, యూనిట్ల స్థాపనకు కృషి చేయాలని సూచించారు. మన ఊరు మన బడి లో భాగంగా రాష్ట్రంలో 7289 కోట్ల ఖర్చుతో అభివృద్ధి కార్యక్రమాలు చేేపట్టామన్నారు. తొలిదశలో 3497 కోట్లతో 9123 పాఠశాలల అభివృద్ధి చేేపట్టనున్నామన్నారు. మన ఊరు మన బడిలో భాగంగా వికారాబాద్ జిల్లాలో మొదటి దశలో 371 పాఠశాలల్లో 12 అంశాలతో అభివృద్ధి పనులు జరుగుతాయన్నారు. జిల్లాలో  790 మంది అత్యధికంగా ఉన్న పాఠశాల నుండి 100 మంది వరకు ఉన్న పాఠశాలలు ఎంపిక చేస్తారు. పాఠశాల మేనేజ్ మెంట్ కమిటీ ద్వారా నిధుల ఖర్చు, ఎస్ ఎం సి చైర్మన్, సర్పంచ్, ప్రధానోపాధ్యాయుడు, అసిస్టెంట్ ఇంజనీర్ లతో కూడిన నలుగురు సభ్యుల కమిటీ ద్వారా నిధులు ఖర్చు చేయాలి. మన ఊరు - మన బడి పథకంలో భాగంగా మరుగుదొడ్లు, నీటి వసతి, విద్యుత్, ఫర్నిచర్, మేజర్, మైనర్ రెపర్ లు, పెయింటింగ్, గ్రీన్ చాక్ బోర్డులు, కాంపౌండ్ వాల్స్, కిచెన్ షెడ్లు, డైనింగ్ హాల్ లు, డిజిటల్ ఎడ్యుకేషన్ కు సంభందించి ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. ప్రతి ఉన్నత పాఠశాలల్లో, జూనియర్ కళాశాలలో గ్రంథాలయాలు. త్వరలో ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాలో పర్యటిస్తారు. నూతన కలెక్టర్ కార్యాలయంను ప్రారంభిస్తారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర అభివృద్ధి ఒక ప్రత్యేక విజన్ తో పని చేస్తుంటే కేంద్రం మాత్రం రాష్ట్రంపై వివక్ష చూపుతుంది. దేశంలో నూతనంగా  నవోదయ కళశాలలు మంజూరు చేస్తే రాష్టానికి ఒక్కటి ఇవ్వలేదు. ఒక్క మెడికల్ కళశాల ఇవ్వలేరు, కాళేశ్వరానికి జాతీయ హోదా ఇవ్వలేదు. రాష్ట్ర అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్న ముఖ్యమంత్రి గారి పై విమర్శలు కాదు... రాష్టానికి నిధులు తీసుకువచ్చి అభివృద్ధి లో పోటీ పడండి. పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా కోసం మాట్లాడాని వారు పాదయాత్రలో జిల్లా పెరు మార్పు గురుంచి మాట్లాడటము గర్వించదగ్గ విషయం. హాజరైన కలెక్టర్ నిఖిల, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్, కాలే యాదయ్య, కొప్పుల మహేశ్వర్ రెడ్డి, పట్నం నరేందర్ రెడ్డి, పైలట్ రోహిత్ రెడ్డి, అడిషనల్ కలెక్టర్ మోతిలాల్, రాష్ట్ర విద్యా మౌలిక సదుపాయాల సంస్థ చైర్మన్ నాగేందర్ గౌడ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మురళి కృష్ణ, జడ్పీ సిఈఓ జానకి రెడ్డి, ఎస్ సి కార్పొరేషన్ ఈ డి బాబు, డిఈఓ రేణుక, డిఆర్డిఏ పిడి కృష్ణన్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.