అఖిలపక్షం ఆధ్వర్యంలో భారత్ బంద్ నిరసనలు

Published: Tuesday September 28, 2021
వికారాబాద్ బ్యూరో 27 సెప్టెంబర్ ప్రజాపాలన : అఖిలపక్షం ఆధ్వర్యంలో భారత్ బంద్ జిల్లా వ్యాప్తంగా నిరసనలు హోరెత్తాయి. సోమవారం జిల్లా పరిధిలోని వికారాబాద్ తాండూర్ కొడంగల్ పరిగి నియోజకవర్గాలలో ఉదయం 5 గంటల ప్రాంతంలో వివిధ బస్ డిపోల ముందు ధర్నా నిర్వహించారు. బస్ డిపోల నుండి ఇ బస్సుల రాకపోకలను అడ్డుకున్నారు. ఒక వైపు గులాబీ తుఫాన్ ప్రభావం, మరోవైపు అఖిలపక్షం నిరసన పర్వాలు నియోజకవర్గాలలో మిన్నంటాయి. పట్టణ కేంద్రాలలోని వ్యాపార సముదాయాలను మూసివేయిస్తూ నిరసన చేపట్టారు. పరిగి పట్టణ కేంద్రంలో పరిగి మాజీ ఎమ్మెల్యే డిసిసి అధ్యక్షులు టి.రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంది. ఆర్టీసీ బస్సులో కూర్చొని టిఫిన్ చేస్తూ నిరసన చేపట్టి నూతన ఒరవడిని సృష్టించారు. పట్టణ రహదారులలో ర్యాలీ నిర్వహిస్తూ దిగ్బంధం చేసి దుకాణ సముదాయాలు మూసివేయించారు. వికారాబాద్ పట్టణ కేంద్రంలోని అతిథి గృహం నుండి ఆలంపల్లి వరకు  అఖిలపక్షం మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు అర్థసుధాకర్ రెడ్డి, సిపిఎం కార్యదర్శి మల్లేశం, న్యూడెమోక్రసీ అధ్యక్షుడు మహేందర్, కెవిపిఎస్ కార్యదర్శి ఆర్.మహిపాల్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ ఆస్తులను కార్పొరేట్ సంస్థలకు విక్రయించడం అధర్మమని విమర్శించారు. పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు పెంచి పేద మధ్యతరగతి ప్రజల నడ్డి విరుస్తున్నారని ఆవేదన చెందారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో 101 హామీలు ఇచ్చి సీఎం కేసీఆర్ ప్రజలను మోసం చేశాడని ఆరోపించారు. రాష్ట్రంలో ఎక్కడ ఉప ఎన్నికలు జరిగితే అక్కడ సీఎం కేసీఆర్ వరాల జల్లు కురిపిస్తున్నాడని ఎద్దేవా చేశారు. హుజురాబాద్ ఉప ఎన్నికల దృష్టితోనే దళిత బందును ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. జిల్లాలో అఖిలపక్షం బంద్ భారత్ బంద్ పిలుపు ఇచ్చిన దృష్ట్యా జిల్లా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పహారా కాశారు. అఖిలపక్షం చేపట్టిన భారత్ బంద్ పాక్షికంగా జరగడం విశేషం బంద్ ప్రభావం ప్రజల పై మాత్రం చూపలేదు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ టిడిపి సిపిఐ సిపిఎం ఎస్పి బి ఎస్ పి తదితర విపక్షాలు పాల్గొన్నాయి.