సిద్దిపేటలో మొదలవనున్న మున్సిపల్ ఎన్నికల సందడి

Published: Thursday March 25, 2021
ఏప్రిల్ 15తో ముగియనున్న పాలకవర్గం గడువు.
అధికారపార్టీకి ఈసారి కొంత గడ్డుపరిస్థితి ఎదురయ్యే అవకాశం.
సిద్దిపేట(ప్రజాపాలన ప్రతినిధి) : సిద్దిపేట మున్సిపాలిటీ పాలకవర్గం గడువు ఏప్రిల్ 15తో ముగుస్తుండడంతో ఎన్నికలు నిర్వహించడానికి రాష్ట్ర ఎన్నికల కమీషన్స మాయాత్తవవుతున్నట్లు తెలుస్తుంది. రాష్ట్రంలో వరంగల్, ఖమ్మం మున్సిపాలిటీ ల గడువు ఇప్పటికే ముగియగా సిద్దిపేటకు ఏప్రిల్ 15 తో ముగుస్తుంది, వీటితో పాటు నూతనంగా ఏర్పడిన మిర్యాలగూడ మున్సిపాలిటీ కి కూడా మొదటిసారి ఎన్నికలు జరగనున్నాయి. ఐతే గత సిద్దిపేట మున్సిపాలిటీ ఎన్నికలకు త్వరలో జరగబోయే ఎన్నికలకు తేడా కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. గత ఎన్నికల సమయంలో ప్రతిపక్ష పార్టీలు నిస్తేజంగా ఉండగా ఈసారి అధికార టి ఆర్ ఎస్ కు కొంత ప్రతికూల పవనాలు వీచే అవకాశం మెండుగా కనిపిస్తుంది. సిద్దిపేట మున్సిపాలిటీలో బీజేపీ మునుపటి కంటే బాగా బలపడగా, కాంగ్రెస్ సంస్థాగతంగా బలంగానే ఉన్న నాయకుల లేమి, ఉన్న నాయకుల మద్య సమిష్టి తత్వం కొరవడడం ఆపార్టీకి ఇబ్బందిగా మారింది. అధికార పార్టీకి మంత్రి హరీష్ రావే కర్త, కర్మ, క్రియగా ఉండగా, కాంగ్రెస్ పార్టీకి సంస్థాగత బలం, బీజేపీ పార్టీకి యువత పెద్ద ఎత్తున అండగా ఉండబోతున్నట్లు స్థానికులు ముచ్చటించుకుంటున్నారు. ఏదేమైనా ఈసారి సిద్దిపేట మున్సిపల్ ఎన్నికలు రసవత్తరంగా మారబోతున్నాయనటంలో సందేహం లేదు అనుకుంటున్నారు స్థానిక ప్రజానీకం.