బంగారు తెలంగాణ కాదు బతుకు తెలంగాణ కావాలి.

Published: Thursday March 18, 2021

గడపగడపకు సిపిఐ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు రామడుగు లక్ష్మణ్.


మంచిర్యాల జిల్లా ప్రతినిధి, మార్చి 17, ప్రజాపాలన : తెలంగాణ రాష్ట్రం తన అస్తిత్వాన్ని కోల్పోతుందని, త్యాగాలతో సాదించుకొన్న రాష్ట్రంలో బంగారు తెలంగాణ కాదు నేడు బతుకు తెలంగాణ కోసం పోరాటం సాగించవలసిన పరిస్థితి ఏర్పడిందని సిపిఐ  రాష్ట్ర కమిటీ సభ్యులు రామడుగు లక్ష్మణ్ అన్నారు. బుధవారం జిల్లా వ్యాప్తంగా గడపగడపకు సీపీఐ కార్యక్రమం సందర్భంగా ప్రజలనుద్దేశించి ఆయన మాట్లాడారు. అనేకమంది త్యాగధనుల అమరత్వంతో ఎరుపెక్కిన ఎర్రజెండ ప్రజాసమస్యల పరిష్కారమే మార్గంగా, భిన్నత్వంలో ఏకత్వంగా దేశ ఐక్యతే ధ్యేయంగా సాగిస్తున్న పోరాటాల క్రమంలో డిసెంబరు 26తో సిపిఐ 95 వసంతాలను పూర్తి చేసుకొందని ఆయన పేర్కొన్నారు. బ్రిటీష్ వలసవాదుల పాలనలో సాగిన దుష్టకృత్యాలకు వ్యతిరేకంగా భారత కమ్యూనిస్టు పార్టీ ఉత్తరప్రదేశ్లోని కాన్పూరులో ఆవిర్భవించిందని గుర్తుచేశారు. రాజకీయ పార్టీలు మతాన్ని రాజకీయ స్వార్థ ప్రయోజనాలకు వాడుకోవడం అనైతికం, రాజ్యాంగ వ్యతిరేకం అన్నారు. జనాకర్షణ విధానాలతో ప్రజలను మభ్యపెట్టడంతో దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలవుతున్నదని ఆవేదన వ్యక్తంచేశారు. తెలంగాణ రాష్ట్రం ఏకపక్ష నిరంకుశ పాలనతో కొనసాగుతున్నదని పేర్కొన్నారు. 2018 శాసనసభ ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు ఇప్పటికీ ఆచరణకు నోచుకోలేదని విమర్శించారు. రైతులకు లక్ష రూపాయలు రుణం మాఫీ, నిరుద్యోగులకు రూ.3016 నెలసరి భృతి, దళిత గిరిజనులకు మూడెకరాల భూమి, ఇళ్లస్థలాలు, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, ఉద్యోగాల కల్పన ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నచందంగా ఉందని అన్నారు. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యల పరంపర సాగుతున్నదని. ఉపాధి కూలీలకు నిధులలో అంతులేని జాప్యం జరుగుతున్నదని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు ఇప్ప కాయల లింగయ్య, పట్టణ కార్యదర్శి రాయబారపు వెంకన్న, జిల్లా కమిటీ సభ్యులు  మిట్టపల్లి పౌలు, వనం సత్యనారాయణ, నక్క వెంకట స్వామి, ఎఐఎస్ ఎఫ్ జిల్లా అధ్యక్షులు దుర్గ రాజు, మహిళా సమైక్య నాయకురాలు ఎలిగేటి వజ్ర, సిపిఐ నాయకులు రాయబారపు జనార్ధన్, మామిడి గోపి, ఎండి రసూల్, రాయమల్లు తదితరులు పాల్గొన్నారు.