జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ కరీంనగర్ జూలై 10 ప్రజాపాలన ప్రతినిధి : జిల్లాలో విస్తారంగా కుర

Published: Monday July 11, 2022
జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్
 
 కరీంనగర్ జూలై 10 ప్రజాపాలన ప్రతినిధి :
 జిల్లాలో   విస్తారంగా కురుస్తున్న వర్షాల నేపథ్యం లో జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు ఇబ్బంది కలగకుండా అన్ని ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ తెలిపారు.
 
        ఆదివారం హైద్రాబాద్ నుండి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ లు,ఎస్.పి.లు,ఇతర ఉన్నత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి భారీ వర్షాల కారణంగా జిల్లాల్లో పరిస్థితులను సమీక్షించి తగు ఆదేశాలు జారీ చేశారు.  గత రెండు మూడు రోజులుగా  జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజలకు ఇబ్బంది కలగకుండా జిల్లాలో అన్ని శాఖల అధికారులను అప్రమత్తం చేసినట్లు,లోతట్టు ప్రాంతాల పై ప్రత్యేక దృష్టి  పెట్టి చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి తెలిపారు. లోయర్ మానేర్ డ్యాం దిగువన ఉన్న ప్రజలను అప్రమత్తం చేసినట్లు  జిల్లాలో ఎలాంటి సంఘటనలు జరగకుండా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉందని కలెక్టర్ తెలిపారు.
 
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ హైదరాబాద్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ  రాష్ట్ర వ్యాప్తంగా కురుసున్న వర్షాల కారణంగా ఆస్తి,ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు .లోతట్టు ప్రాంతాలు గుర్తించి జలమయం కాకుండా ముందు జాగ్రత్తగా అక్కడి ప్రజలను వేరే చోటుకు తరలించాలని, అవసరమైతే సహాయ శిబిరాలు ఏర్పాటు చేయాలని,విద్యుత్ స్తంభాలు పడిపోతే వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని,ఎక్కడైతే వర్షం నీరు అధికంగా ప్రవహించే రహదారులు,కాజ్ వే లలో ప్రజలు ఇబ్బంది పడకుండా బారి కేడింగ్ ఏర్పాటు చేసి రక్షణ ఏర్పాట్లు చేయాలని అన్నారు 
 
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, శ్యామ్ ప్రసాద్ లాల్, ఇరిగేషన్ శాఖ ఎస్ఈ  శివ కుమార్, ఈఈ నాగభూషణం,ఆర్డిఓ ఆనంద్ కుమార్ , ఎలక్ట్రిసిటీ ఎస్ఈ గంగాధర్ ,కమిషనర్ సేవా ఇస్లావత్ ,జిల్లా పంచాయతీ అధికారి వీర బుచ్చయ్య జిల్లా అగ్నిమాపక అధికారి వెంకన్న, పోలీసు అధికారులు తదితరులు పాల్గొన్నారు.