గ్రూప్ వన్ ప్రిలిమ్స్ కు అర్హత సాధించిన తండ్రి తనయుడు

Published: Monday January 16, 2023

బోనకల్ జనవరి 14 ప్రజా పాలన ప్రతినిధి : గురుబ్రహ్మ గురు విష్ణు గురు మహేశ్వర అంటూ గురువుకు దేవతలతో సమానంగా పూజించాలని మన వేదాల్లో చెపుతుంటారు. ప్రతి విద్యార్థి తన సాధించిన విజయాల్లో గురువు పాత్ర ఎంతో కీలకం. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి,. వారిని విజయ తీరాలకు చేర్చే ఉపాధ్యాయుడు తన కుమారుడికి కూడా చదువులో సహాయం చేస్తూ, తన కుమారుడితో పాటు తను కూడా పరీక్షలకు హాజరై గ్రూప్ 1 ప్రిలిమ్స్ కు తండ్రీ కొడుకులు ఇద్దరు అర్హత సాధించిన సంఘటన మండల కేంద్రంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే మండల పరిధిలోని బ్రాహ్మణపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో దాసరి రవి కిరణ్ ప్రధానోపాధ్యాయుడిగా పని చేస్తున్నారు.వారి కుమారుడు ఇమ్మానియేల్ మైఖేల్ రాజు గ్రూప్ వన్ అధికారిగా అర్హత సాధించడానికి గ్రూప్ వన్ పరీక్ష కోసం సిద్ధం అవుతుండటంతో రవి కిరణ్ తన కుమారుడికి తన విజ్ఞానాన్ని పంచటమే కాకుండా తన కూడా పరీక్షలకు హాజరవడం జరిగింది. నేడు వెల్లడించిన ఫలితాలలో తండ్రి కొడుకులు ఇద్దరు గ్రూప్ వన్ ప్రిలిమ్స్ కు అర్హత సాధించడం జరిగింది. గ్రూప్స్ కు అర్హత సాధించిన తండ్రి - కుమారులు ఇద్దరినీ పలువురు అభినందనలు తెలిపారు.