త్రీఫేజ్ లైన్ పెండింగ్ పనులు చేయాలి : జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి

Published: Wednesday June 30, 2021

మంచిర్యాల జిల్లా ప్రతినిధి,జూన్ 29, ప్రజాపాలన : ప్రభుత్వం చేపట్టిన 4వ విడత పల్లెప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలలో భాగంగా విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టవలసిన త్రీఫేజ్ లైన్ పెండింగ్ పనులు జూలై 10వ తేదీ లోగా పూర్తి స్థాయిలో చేయాలని జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సముదాయంలోని కలెక్టర్ చాంబర్ లో జిల్లా అదనపు కలెక్టర్ ఇలా త్రిపాఠి, ట్రైనీ కలెక్టర్ ప్రతిభా సింగ్, విద్యుత్ శాఖ ఎన్.సి. రమేష్ బాబుతో కలిసి జిల్లాలోని డి.ఈ., ఎ.ఈ.లు, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం జూలై 1వ తేదీ నుండి 10వ తేదీ వరకు చేపట్టనున్న 4వ విడత పల్లెప్రగతి, పట్టణ ప్రగతి స్పెషల్ డ్రైవ్ కార్యక్రమంలో విద్యుత్ శాఖ నంబంధిత పనులు త్వరగా పూర్తి చేయాలని తెలిపారు. గ్రామాలు, మున్సిపాలిటీల పరిధిలో వంగిపోయిన, విరిగిపోయిన, ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ స్తంభాలు తొలగించి నూతన స్తంభాలను ఏర్పాటు చేయాలనిసూచించారు. అదనంగా నిరుపయోగంగా ఉన్న స్తంభాలను అవసరమైన చోట వినియోగించాలని, ఇండ్ల పైనుండి వెళ్ళిన, వ్రేలాడుతున్న విద్యుత్ తీగలను నవరించాలని కోరారు. అన్ని ట్రాన్స్ఫార్మర్లను పరిశీలించి అవసరమైన వాటి మరమ్మత్తులు చేపట్టాలని, ప్రతి గ్రామంలో త్రీఫేజ్ లైన్ పనులు పెండింగ్లో లేకుండా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతి రోజు జరిగిన పని వివరాలు, ఫొటోలు అప్లోడ్ చేయాలని, సిబ్బంది, బృందాలు ప్రతి రోజు గ్రామాలలో ఉంటూ తలెత్తిన నమన్యలను వెంట వెంటనే పరిష్కరించాలని తెలిపారు. విద్యుత్ స్తంభాలు అదనంగా కావలసి వస్తే గ్రామపంచాయతీ, మున్సిపాలిటీల నుండి సరైన బిల్లులు చెల్లించి పొందాలని తెలిపారు. జూలై 2వ తేదీన పవర్ హాలీడేగా ఏర్పాటు చేసి ప్రతి మండల పరిధిలో, గ్రామాలలో ఉన్న విద్యుత్ పనులను పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.  ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ డి.ఈ.లు, ఏ.ఈ.లు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.