వరద బాధితుల హామీ నెరవేర్చమని నిరసన దీక్ష చేస్తున్న గోదావరి వరద ముంపు బాధితులపై అటవీ సిబ్బంద

Published: Wednesday January 11, 2023

ఈరోజు జనవరి 10న ఉదయం 9 గంటల నుండి గోదావరి వరద ముంపు బాధితులపై ఫారెస్ట్ సిబ్బంది దౌర్జన్యానికి పాల్పడ్డారు.  150 రోజులుగా 300 మంది వరద బాధితులు శాంతియుతంగా నిరవధిక నిరసన దీక్షను చేపడుతున్నారు. అటవీ  సిబ్బందికి నిరసనకారులకు మధ్య ఎలాంటి వివాదం లేదు. రోడ్డు ప్రక్కన ఆర్ అండ్ బి  ప్రభుత్వ స్థలములో 300 మంది ఆదివాసీలు గుడారాలు ఏర్పాటు చేసుకొని నిరవధిక నిరసన దీక్ష చేపట్టారు. ఈ దీక్ష శిబిరాన్ని అటవీ సిబ్బంది ధ్వంసం చేశారు. నివాస స్థలం చూపించమని తహసిల్దార్, కలెక్టర్ తో సంప్రదింపులు జరుపుతున్నాం. గోదావరి ముంపు బాధితులతో పాటు నిరుపేద ఆదివాసి, దళితులకు కూడా గృహ వసతి కల్పించమని కోరుతున్నాము. పినపాక భద్రాచలం నియోజకవర్గం పరిధిలో దాదాపు 25వేల కుటుంబాలు గృహాలు లేక ఇబ్బంది పడుతున్నారు. సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ మద్దతుతో నిరుపేదలు పోరాట కమిటీని ఏర్పాటు చేసుకొని శాంతియుతంగా పోరాడుతున్నారు. ఇది ముఖ్యమంత్రి హామీని నెరవేర్చమని చేస్తున్న పోరాటం. ఆదివాసీలపై అటవీ సిబ్బంది దౌర్జన్యానికి పాల్పడటం పూర్తిగా చట్ట వ్యతిరేకం. వీరు తగిన మూల్యం చెల్లించుకోవలసి వస్తుందని హెచ్చరిస్తున్నాం. అటవీ సిబ్బంది దాడిలో వాసం భద్రమ్మ, కురసం భద్రమ్మ అనే ఆదివాసీ మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. అటవీ మహిళా సిబ్బంది వీరిపై పిడిగుద్దులు గుద్దుతూ, బూట్లతో కిందపడేసి తొక్కారు. ఈ పెనుగులాటలో అనేకమంది ఆదివాసీ మహిళలను గాయపరచడం వలన సొమ్మసిల్లి పడిపోయారు. 2022 జులై 17న భద్రాచలంలో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని నెరవేర్చుటకు స్థానిక పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు తగిన కృషి చేయాలని కోరుతున్నాం. ఈ ఆర్థిక సంవత్సరంలో కేటాయించిన 1700 కోట్ల తో గృహ వసతి కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం. అటవీ సిబ్బందిని అదుపులో పెట్టాలని కోరుతున్నాం. లేనియెడల జరగబోయే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకురాలు పెద్దగోని ఆదిలక్ష్మి, గోదావరి వరద ముంపు బాధితుల పోరాట కమిటీ అధ్యక్షుడు ఎట్టి లక్ష్మణ్, నిరుపేదల గృహకల్ప సాధన కమిటీ నాయకులు కొండపనేని కృష్ణయ్య, ముత్యాల సత్యనారాయణ, పోరాట కమిటీ నాయకులు కొమరం సుజాత, కొమరం భద్రమ్మ,  సున్నం భూలక్ష్మి,  గజ్జల అలివేలు, పర్సిక రమణ చిడుం ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.