నారాయణ్ ఖేడ్ లో యన్.ఆర్.ఇ.జి.యస్. సిమెంట్ రోడ్లకు 7 కోట్లు మంజూరు

Published: Tuesday January 25, 2022
హైదరాబాద్ 24 జనవరి ప్రజాపాలన ప్రతినిధి: మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం కింద నారాయణ్ ఖేడ్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో 7 కోట్ల రూపాయల సిమెంట్ రోడ్ల పనులు మంజూరైనట్లు స్థానిక శాసనసభ్యులు యం.భూపాల్ రెడ్డి ప్రకటించారు. మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం ద్వారా సిమెంట్ రోడ్డు పనులు 2019-20 సంవత్సరం లో మంజూరీ చేసినారు. 2020 మార్చి నెల వరకు పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రపంచ వ్యాప్తంగా 2020లో కరోనా మహమ్మారి కారణంగా కొన్ని పనులను ప్రారంభించలేక పోయారు. మారుమూల గ్రామాల్లో పక్కా రోడ్లను తయారు చేయాలనే తలంపుతో రాష్ట్ర ప్రభుత్వం 2021-22 సంవత్సరంలో సిమెంట్ రోడ్ల ను మంజూరు చేసినది. దీనిలో భాగంగా సంగారెడ్డి జిల్లా నారాయణ్ ఖేడ్ అసెంబ్లీ నియోజకవర్గ 6 మండలాల పరిధిలోని గ్రామాల్లో 132 సిమెంట్ రోడ్ల పనులకు గాను 7 కోట్ల రూపాయలు 2021-22 సంవత్సరానికి గాను మంజూరు చేసినట్లు శాసన సభ్యులు మహారెడ్డి భూపాల్ రెడ్డి ప్రకటించారు.
1.కల్హేర్ మండల పరిధిలో 22 సిమెంట్ రోడ్ల పనులకు గాను 125 లక్షలు.
2.కంగ్టీ మండల పరిధిలో 22 సిమెంట్ రోడ్ల పనులకు గాను 115 లక్షలు.
3.సిర్గాపూర్ మండల పరిధిలో 19 సిమెంట్ రోడ్ల పనులకు గాను 110 లక్షలు.
4.మనూర్ మండల పరిధిలో 17 సిమెంట్ రోడ్ల పనులకు గాను 95 లక్షలు.
5.నాగల్ గిద్ద మండల పరిధిలో 24 సిమెంట్ రోడ్ల పనులకు గాను 125 లక్షలు.
6.నారాయణ్ ఖేడ్ మండల పరిధిలో 28 సిమెంట్ రోడ్ల పనులకు గాను 140 లక్షలు.
ఈవిధంగా నియోజకవర్గ పరిధిలో 132 సిమెంట్ రోడ్ల పనులకు గాను 7 కోట్ల రూపాయలు మంజూరు అయినట్లు స్థానిక శాసనసభ్యులు ప్రకటించారు. సిమెంట్ రోడ్ల పనులకు అంచనాలను వెంటనే తయారు చేసి పనులను ప్రారంభించ వలసినదిగా పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. 2019-20 సంవత్సరంలో పరిపాలన ఆమోదం పొందిన పనులను కూడా సకాలంలో పూర్తి చేయాలని ఈసందర్భంగా సంబంధిత అధికారులను ఆదేశించారు. నారాయణ్ ఖేడ్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం కింద అధికంగా సిమెంట్ రోడ్ల పనులను  మంజూరు చేసిన ముఖ్యమంత్రి కెసీఆర్, సహకరించిన మంత్రులు హరీష్ రావు మరియు ఎర్రబెల్లి దయాకర్ రావు లకు ఖేడ్ నియోజకవర్గ ప్రజల తరఫున శాసనసభ్యులు మహారెడ్డి భుపాల్ రెడ్డి ధన్యవాదాలు తెలియజేశారు.