రాష్ట్ర సంపదతో పేదరికాన్ని నిర్మూలించడమే ప్రభుత్వ లక్ష్యం

Published: Monday August 16, 2021
వికారాబాద్ బ్యూరో 15 ఆగస్ట్ ప్రజాపాలన : రాష్ట్ర సంపదతో పేదరికాన్ని నిర్మూలించడమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. ఆదివారం జిల్లా ఎస్పీ పరేడ్ గ్రౌండులో 75వ స్వాతంత్రదినోత్సవ వేడుకలు కలెక్టర్ పౌసుమి బసు ఆధ్వర్యంలో జిల్లా ఎస్పీ నారాయణ, జిల్లా జడ్పి చైర్ పర్సన్ సునీతా రెడ్డి, ఎమ్మెల్యేలు డాక్టర్ మెతుకు ఆనంద్, కొప్పుల మహేశ్వర్ రెడ్డి, పట్నం నరేందర్ రెడ్డిల సమక్షంలో ముఖ్య అతిథిగా డిప్యూటీ స్పీకర్ పద్మా రావు హాజరై పతాకావిష్కరణ చేసి పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో అట్టడుగు వర్గాలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. దళితులకు సమాజంలో గౌరవ స్థానం కల్పించాలనే ఉద్దేశంతో దళిత బంధు పథకం ప్రవేశ పెట్టడం జరిగిందని చెప్పారు. దేశంలోని ఏ రాష్ట్రంలో లేని పథకం దళిత బంధు అని పేర్కొన్నారు. తెలంగాణ సంపద రాష్ట్రంలోని పేదల నిర్మూలనకు ఉపయోగపడాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని  తెలిపారు. 97 రైతు వేదికలను రూ.19.14 కోట్ల ఖర్చుతో నిర్మించి రైతులకు అందుబాటులోనికి తేవడం జరిగిందని తెలిపారు. మరణించిన 631 మంది రైతులకు భీమా పథకం ద్వారా రూ.31.55 కోట్ల చెల్లించడం జరిగిందని వివరించారు. మహాత్మగాంధీ జాతీయ ఉపాధి హామి పథకము ద్వారా 1,03,233 కుటుంబాలకు చెందిన 1,92,328 మంది కూలీలకు 56,81,784 పనిదినాలు కల్పించి మన జిల్లా రాష్ట్ర స్థాయిలో 4వ స్థానంలో నిలిచిందని వివరించారు. రూ.1.36 కోట్లతో కుల్కచర్ల, బొంరాస్ పేట, తాండూరు మిన్ పేటలలో 4 రైతు ఉత్పత్తి దారుల సంఘాలను ఏర్పాటు చేశారు. కొత్రేపల్లి నుండి వికారాబాద్ నూతన కలెక్టరేట్ భవన సముదాయము వరకు 12.4 కిలో మీటర్లు  ఎంఎల్ ఎంపితో  4 వేల మొక్కలను ఒకే రోజు నాటినందున వికారాబాద్ మున్సిపాలిటీకి ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డు ద్వారా ఇండియన్ ఎక్సలెన్సీ అవార్డు రావడం అభినందనియమని ప్రశంసించారు. నాలుగు పురపాలక సంఘాలలో 97 అర్బన్ ట్రీ పార్కులను గుర్తించామని పేర్కొన్నారు. రూ. 6 కోట్లతో నాలుగు పురపాలక సంఘాలలో 6 వైకుంఠ ధామాలను మంజూరు చేశారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు చంద్రయ్య మోతిలాల్ డిఆర్డిఏ కృష్ణన్ ఆర్డీఓ ఉపేందర్ రెడ్డి డిపిఓ రిజ్వానా పోలీసు సిబ్బంది వివిధ శాఖల సిబ్బంది జిల్లా అధికారులు అనధికారులు రాజకీయ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.