కొండనాలుకకు మందేయబోతే ఉన్ననాలుక ఊడింది

Published: Tuesday August 30, 2022

* బంగారు తెలంగాణ చేయబోతే  తాగుబోతుల తెలంగాణగా మారింది

* కాంగ్రెస్ పార్టీ పేదల పెన్నిధి
* త్వరలో నిరుద్యోగ రచ్చబండ ప్రారంభం
* కేరెల్లి రచ్చబండ కార్యక్రమంలో మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్
వికారాబాద్ బ్యూరో 29 ఆగస్టు ప్రజా పాలన : వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి పాలనలో భార్యాభర్తలిద్దరికీ ఆసరా పెన్షన్లు వచ్చేవని కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. సీఎం కేసీఆర్ పాలనలో కుటుంబంలో ఒక్కరికి మాత్రమే ఆసరా పెన్షన్ వస్తుందని విమర్శించారు. సోమవారం ధారూర్ మండల పరిధిలోని కెరెల్లి గ్రామంలో రచ్చబండ కార్యక్రమాన్ని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పట్లోళ్ల రఘువీరారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్రజల చేత జీరో అకౌంట్ ఓపెన్ చేయించి ఆ అకౌంట్లో 15 లక్షలు జమ చేస్తానని బూటకపు మాటలు చెప్పారని దెప్పి పొడిచారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని బీదాలు పలికి చతికిల పడ్డారని పేర్కొన్నారు. ప్రధాని మొదటి ఐదు సంవత్సరాలు విదేశీ పర్యటనలకే కాలయాపన జరిగిందని ఘాటుగా స్పందించారు. పెట్రోల్ డీజిల్ గ్యాస్ నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్న పట్టించుకునే నాథుడే కరువయ్యాడని చెప్పారు. ప్రతి వస్తువుపై జిఎస్టి విధించి పేదల నడ్డి విరుస్తున్నాడని తెలిపారు. చివరికి బ్యాంకుల్లో జమ చేసుకున్న తమ డబ్బులను డ్రా చేసుకోవడానికి టాక్స్ కట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రం బాగుపడాలంటే సాగునీటిని రైతన్నలకు పుష్కళంగా అందించేందుకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ప్రాజెక్టులను నిర్మించిందని గుర్తు చేశారు. సీఎం కేసీఆర్ లక్ష యాభై వేల కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మించుటలో దొర దోచుకున్న డబ్బులే ఎక్కువని విమర్శించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అభివృద్ధిని అటకెక్కించారని ఘాటుగా స్పందించారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అభివృద్ధి గురించి మర్చిపోయి పార్టీలను విమర్శించడం తగదన్నారు. ఈడి భూతాన్ని చూపి ప్రతిపక్షాలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని అన్నారు. కేటీఆర్ మునావర్ కార్యక్రమాన్ని నిర్వహించి మత విద్వేషాలకు ఆజ్యం పోశాడని వెల్లడించారు. సీఎం కేసీఆర్ గోదావరి ముంపు గ్రామాలకు వెళ్లి సాయంత్రం వరకు మొత్తం వెయ్యి కోట్లు విడుదల చేస్తానని ఉత్తరప్రగల్భాలు పలికారని దెప్పి పొడిచారు. సీఎం కేసీఆర్ వికారాబాద్ జిల్లా కేంద్రానికి టోపీ పెట్టుకుని పర్యటనకు వచ్చి ప్రజల నెత్తిన టోపీలు పెట్టి వెళ్లారని విమర్శించారు. దొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్కలు మొరిగినట్టు సీఎం సమావేశంలో చెప్పాల్సిన విషయాన్ని మరుసటి రోజు  10 కోట్లు ఇస్తానని చెప్పడం  విడ్డూరంగా ఉందని దెప్పి పొడిచారు. మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా చాక్ పీస్ ల కొరకు కేటాయించిన నిధులలో తొమ్మిది కోట్లు డబ్బుల స్వాహా చేశారని తెలిపారు. నవాబ్ పేట్ మండల పరిధిలోని మమ్మదాన్ పల్లి గ్రామ ప్రజలను తాగుబోతులకు అడ్డాగా మార్చారని అన్నారు. రోజుకు 9 లక్షల రూపాయలు తాగుడుకు ఖర్చు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం మాఫియాకు అడ్డాగా మారిందని ఘాటుగా స్పందించారు. ఈ కార్యక్రమంలో రాములు అనంతరెడ్డి గట్టేపల్లి రాజేందర్ బుజ్జయ్య నర్సింలు బాలకృష్ణ మాన్సింగ్ విజయభాస్కర్ రెడ్డి మల్లారెడ్డి దయాకర్ రెడ్డి నాగయ్య తదితరులు పాల్గొన్నారు.