జిల్లా పరిషత్ కార్యాలయంలో చాకలి ఐలమ్మకు నివాళులు.. -- జెడ్పీ చైర్ పర్సన్ దావ వసంత

Published: Tuesday September 27, 2022

జగిత్యాల, సెప్టెంబర్ 26 ( ప్రజాపాలన ప్రతినిధి): తెలంగాణ సాయుధ పోరాట వీర వనిత, చిట్యాల (చాకలి) ఐలమ్మ,  బహుజన ఆత్మగౌరవానికి ప్రతీక అని జెడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్ అన్నారు. ఐలమ్మ జయంతి సందర్భంగా జిల్లా పరిషత్ కార్యాలయంలో జెడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్ ఆమెకు నివాళులర్పించారు. తెలంగాణ సాయుధ పోరాటంలో ఐలమ్మ ప్రదర్శించిన ధైర్యసాహసాలు, ప్రజాస్వామిక పోరాటాలకు స్ఫూర్తిగా నిలిచాయని, తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల నేపథ్యం లో ఆమె సేవలను స్మరించుకోవడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి నుంచి విముక్తి కోసం సాగిన తెలంగాణ సాయుధ పోరాటంలో ఐలమ్మ ప్రదర్శించిన తెగువ, పౌరుషం తెలంగాణ అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని చాటి చెప్పాయని జెడ్పీ చైర్ పర్సన్ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవతో ఐలమ్మ జయంతి, వర్థంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహిస్తూ సబ్బండ వర్గాల త్యాగాలను స్మరించుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈవో రామానుజన్ చార్యులు మరియు జిల్లా పరిషత్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.