విశ్వ కవి జాషువా

Published: Thursday September 29, 2022
తీవ్రమైన జీవన సంఘర్షణనుండే జాషువా కవితావధూటి పుట్టింది. అందుకే.....*
 
*"నా కవితా వధూటి వదనంబు నెగాదిగా జూచి రూపురేఖా కమనీయ వైఖరులు గాంచి భళీభళీయన్నవారే మీదేకులమన్న ప్రశ్న వెలయించి చివాలున లేచి పోవుచో. బాకున గ్రుమ్మినట్లుగున్ పార్ధివచంద్ర..! వచింపసిగ్గగున్"*
 
*పాపం సున్నిత మనస్కుడైన ఆ సుకవి మనసు ఎంత గాయపడినదో....?*
*అయినా విశ్వనరుడను నేనంటూ ఎంతో ఆత్మవిశ్వాసం ప్రకటిస్తాడు...*
 
*"కులమతాలు గీసిన గీతన జొచ్ఛి పంజరనాకట్టువడను నిఖిల లోకములు ఎటు నిర్ణయుంచుకున్న నాకేమి తిరుగులేదు సకలజనులకు విశ్వనరుడను నేను నాగు తిరుగులేదు"....* 
 
*"మత పిచ్చిగాని, వర్ణోన్నతిగాని, స్వార్థ చింతనము గానీ నా కృతులందుండదు" అని జాషువా స్పష్టపరిచారు.*
 
*ఎవరూ చూడని చీకటి కోణాలను చూడగల క్రాంతదర్శి జాషువా. వారి కవిత్వంలో జీవన సంఘర్షణలనేకం. తాత్విక దృక్పథంతో...*
 
*"ఇచ్చోటనే సత్కవీంద్రుని కమ్మని కలము నిప్పులలో గఱిగిపోయే" అన్న పద్యం తీవ్రమైన తాత్వికతను కలిగింపచేస్తుంది*
 
*సంప్రదాయ పద్ధతిలో తన కవితా పాటవాన్ని తెలుగు ప్రజలకు వివిధ సాహిత్య ప్రక్రియల్లో రుచి చూపించిన ఈ కవి విశారదుడు - ఆ నాటికి ఏ తెలుగు కవి భారతీయ సాహిత్య రంగంలో సాధించలేనన్ని విశిష్ట స్థానాలను, అవార్డులను, పదవులను పొందారు.*
 
*తండ్రి వీరయ్య, తల్లి లింగమాంబల ప్రేమసాక్షిగా అంకురించిన ఈ పుష్పం చిన్ననాటి నుండే సాహితీ పరిమళాలను వెదజల్లుతూ అందరి దృష్టిని ఆకర్షించింది. విద్యాబుద్ధులలో ఎంతో నేర్పరి అయినప్పటికీ గవ్వకు సాటిరాని కొందరు కాకుల్లాగా పొడిచి అవమానించే ప్రయత్నం చేసినప్పుడు....*
 
*"గవ్వకు సాటిరాని పలుగాకుల మూకల సూయచేతనన్నె విధిదూరినన్ ననువరించిన శారద లేచిపోవునే...?*
*యివ్వసుధ్స్థా లింబొడమరే రసలబ్దులు? గంటమూనిదెన్*
*రవ్వలు రాల్చేదన్ గరగరల్ పచరించెద నాంధ్రవాణికిన్"*
 
*అంటూ తీవ్రంగా గర్హించారు...*
 
మద్రాసులో రేడియో ప్రయోక్తగా, ఆకాశవాణిలో ప్రొడ్యూసర్‌గా అనేక ఉద్యోగాలు చేశారు. వివిధ సాహితీ ప్రక్రియల్లో అందెవేసిన చెయ్యి. కవిత్వం, నాటకాలు, కథలు లాంటి ఎన్నో సాహితీ స్వరూపాలను తనదైన శైలిలో చక్కగా స్పృశించారు. 'గబ్బిలం' 'పిరదౌసి' 'క్రీస్తుచరిత్ర'  ప్రధానవమైన రచనలు.
 
గబ్బిలంలో అణగారిన షెడ్యూల్డు కులాలు తమ దైనందిన జీవితంలో చవిచూస్తున్న అంటరానితనం, నిరుద్యోగం, ఆకలి, దారిద్య్రం, దేవాలయ ప్రవేశ నిషేధం లాంటి వివక్షలను కళ్ళకు కట్టినట్లు తన భావచిత్రాలతో, విశేషణాలతో అద్భుతంగా అభివ్యక్తీకరించారు.
 
'వాని ఱెక్కల కష్టంబు లేనినాడు / సస్యరము పండి పులకింప సంశయించు / వాడు చెమ్మటలోడ్చి ప్రపంచమునకు / భోజనము బెట్టు వానికి భుక్తిలేదు' లాంటి పద్యం ఆకలి బాధ, దారిద్య్రాన్ని వివరించగా...
 
"ఆలయంబున నీవు వ్రేలాడువేళ / శివుని చెవి నీకు గొంత చేరువుగ నుండు / మౌని ఖగరాజ్ఞ, పుజారి లేనివేళ / విన్నవింపుము నాదు జీవిత చరిత్ర'..... ఆలయ ప్రవేశ నిషేదాన్ని, కర్మసిద్ధాంత దుష్పరిణామాలను వివరిస్తుంది.
 
దేశంలోని వివిధ ప్రాంతాల చరిత్ర గొప్పదనం, వైభవాలను వివరిస్తూ గబ్బిలం కైలాసంలోని ఈశ్వరుని చెంతకు చేరుతున్నది.
కవికోకిల సాహితీ సౌరభాన్ని ఆఘ్రాణించిన నాటి తెలుగు నేల ఆయనను వివిధ ప్రాంతాల్లో వివిధ రకాలుగా సన్మానించుకొన్నది.* 
 
గుంటూరు పట్టణం గజారోహణంతో గండపెండేరం తొడిగింది. ప్రభుత్వం ఎంఎల్‌సి పదవిని కట్టబెట్టింది. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. ఆంధ్ర విశ్వకళాపరిషత్ కళాప్రపూర్ణ బిరుదునిచ్చింది. భారత ప్రభుత్వం 1970 ల్లోనే ఆయనకు పద్మభూషణ్ అవార్డుతో ఘనంగా సత్కరించింది. ఇన్ని సత్కారాలు, ఘనసన్మానాలు పొందినా నరనరాల్లో జీర్ణించుకొన్న కులతత్వం, వర్ణ దురహంకారం ఆయనను తరచూ వెక్కిరిస్తూనే ఉండేది. సభా మర్యాదగా ఆయనను సన్మానించి సాదరంగా నమస్కరించిన వారే...నోటితో వెక్కిరించి నొసలు చిట్లించేవారు. అలా అవమానాలను ఎదుర్కొంటూనే జన్మతః వచ్చిన సాహితీ సౌరభాలను వెల్లడిస్తూ 1971_జూలై_24 న దివికేగారు జాషువా గారు.
 
నేడు ఆయన జయంతి సందర్భంగా... వారికి మరొక సారి ఘన నివాళులు అర్పిస్తూ-
 ఉషశ్రీ తాల్క