ఘనంగా ప్రపంచం మృత్తిక దినోత్సవం

Published: Tuesday December 06, 2022
 జిల్లా వ్యవసాయ అధికారి గోపాల్
వికారాబాద్ బ్యూరో 5 డిసెంబర్ ప్రజా పాలన : ప్రపంచ మృత్తిక దినోత్సవం సందర్బంగా వికారాబాద్ మండలం నారాయణపూర్ రైతు వేదికలో రైతులకు నేలల సంరక్షణ, యాజమాన్యం గురించి రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించామని జిల్లా వ్యవసాయ అధికారి గోపాల్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ పంటలలో అధిక దిగుబడులు పొందేందుకు సిఫారసుకు మించి రసాయనిక ఎరువులు, పురుగు మందులు, కలుపు నివారణ మందులు వాడడం వలన భూసారం తగ్గుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. నేలలు క్షీణతకు గురవడమే కాకుండా రసాయనాల పంట ఉత్పత్తుల ద్వారా ఆహారంలోకి చేరి మానవాళి ఆరోగ్యంపై చెడు ప్రభావాలు చూపుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రైతులు సేంద్రీయ, జీవన ఎరువుల వాడకం, రెండు పంటల కోసారైన పంట మార్పిడి పాటించడం, వరి కొయ్యలను, వ్యర్థాలను కాల్చి వెయ్యకుండా రోటవేటర్ తదితర పరికరాలతో నేల లోనికి కలియదున్ని నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని తెలిపారు. 
ఈ సందర్బంగా జిల్లా రైతుబంధు సమితి కొ- ఆర్డినేటర్ రాంరెడ్డి మాట్లాడుతూ పొలాల గట్ల పైన చెట్ల పెంపకం ద్వారా నేల కోతను అరికట్టి వర్మి కంపోస్ట్, పచ్చి రొట్ట పైర్ల పెంపకం ద్వారా నేల సారాన్ని పెంచుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎరువాక కేంద్రం డా. యమున  మాట్లాడుతూ భూసారాన్ని పరీక్ష ద్వారా విశ్లేషించి దానికి అనుగుణంగా ఎరువులను సమతుల్యంగా వాడుకోవాలన్నారు.  సిఫారసు చేసిన పోషకాలను 50-60 శాంతం రసాయనిక ఎరువుల రూపం లోను, మిగిలిన బాగం సేంద్రీయ ఎరువుల రూపంలోను వాడుకోవడం ద్వారా భూ సారం పరిరక్షించగలం అని తెలిపారు.  ఈ కార్యక్రమంలో మండల  రైతు బంధు సమితి
 కొ- ఆర్డినేటర్ వెంకటయ్య, వికారాబాద్ ఎంపీడీఓ సత్తయ్య,  పెండ్లిమడుగు సర్పంచ్ బుచ్చిరెడ్డి, వ్యవసాయ విస్తరణ అధికారి అనిల్,  రైతు బంధు సమితి సభ్యులు, వివిద గ్రామాల రైతులు పాల్గొన్నారు.