బోడుప్పల్ 22వ డివిజన్లో రూ1.70 కోట్లతో పలు అభివృద్ధి పనులు పూర్తి

Published: Monday January 31, 2022
కార్పొరేటర్ దొంతరబోయిన మహేశ్వరి కృపసాగర్ ముదిరాజ్
మేడిపల్లి, జనవరి 30 (ప్రజాపాలన ప్రతినిధి) : బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 22వ డివిజన్లో ఈ రెండేళ్లల్లో ఎన్నో ఒడిదుడుకులు, విపత్కర పరిస్థితుల మధ్య, ఒకవైపు ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి బారిన ప్రజలు పడకుండా ఎప్పటికప్పుడు ముందస్తు జాగ్రత్తలు చేపడుతూనే, మరోవైపు ప్రకృతి వైపరీత్యాలు, భారీ వర్షాలు, వరదల నుండి ప్రజలను రక్షించుకుంటూ, డివిజన్లో రూ 1.70 కోట్ల వ్యయంతో పలు అభివృద్ధి కార్యక్రమాలను పూర్తిచేశామని కార్పొరేటర్ దొంతరబోయిన మహేశ్వరి కృపసాగర్ ముదిరాజ్ పేర్కొన్నారు. కార్పొరేటర్గా రెండు సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా కార్పొరేటర్ దొంతరబోయిన మహేశ్వరి కృపసాగర్ ముదిరాజ్ మాట్లాడుతూ మంత్రివర్యులు చామకూర మల్లారెడ్డి, బోడుప్పల్ మేయర్ సామల బుచ్చిరెడ్డి, డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మీ రవి గౌడ్ సహకారంతో డివిజన్ టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజల మద్దతుతో డివిజన్ ను అభివృద్ధి పథంలో నడిపిస్తున్నామనీ తెలిపారు. గడిచిన 2 సంవత్సరాలలో 1.70 కోట్ల వ్యయంతో డివిజన్లోని రాజశేఖర్ కాలనీ, ఐదయ్య నగర్, సూర్యహిల్స్, నవోదయ కాలనీ, న్యూహేమనగర్లలో రోడ్లు, డ్రైనేజీ, వాటర్ లైన్స్, విద్యుత్ స్తంభాలు, ఇంటర్ పోల్స్ మరియు రాజశేఖర్ కాలనీలో పార్కుల కాంపౌండ్ వాల్స్, వెస్ట్ బాలాజీలో చిల్డ్రన్ పార్క్, డివిజన్లో హరిత హారంలో మొక్కలు నాటడం, సీసీ కెమెరాలు వంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి చేస్తూ, ప్రజలకు రేషన్ కార్డులు, కల్యాణ లక్ష్మీ చెక్కులు, సీఎంఆర్ఎఫ్, పెన్షన్లు మంజూరు చేయించమని తెలియజేశారు. మంత్రివర్యులు చామకూర మల్లారెడ్డి, మేయర్లు, డివిజన్ టీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, కాలనీల అసోసియేషన్ సభ్యుల, ప్రజలందరినీ ఆశీస్సులతో వచ్చే మూడు సంవత్సరాలలో డివిజన్ను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని కార్పొరేటర్  దొంతరబోయిన మహేశ్వరి కృపసాగర్ ముదిరాజ్ తెలిపారు.