ముర్రు పాలు బిడ్డకు రక్షణ కవచం

Published: Thursday August 04, 2022
బిడ్డ పుట్టిన అరగంటలో ముర్రుపాలు ఇవ్వాలి
* చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్టు ఆఫీసర్ వెంకటేశ్వరమ్మ
వికారాబాద్ బ్యూరో 03 ఆగస్టు ప్రజా పాలన : బిడ్డ పుట్టిన మొదటి అరగంటలో తల్లి ముర్రుపాలు ఇవ్వాలని చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్టు ఆఫీసర్ వెంకటేశ్వరమ్మ హితవు పలికారు. బుధవారం వికారాబాద్ మండల పరిధిలోని పులుమద్ది గ్రామంలో తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఆమె మాట్లాడుతూ బిడ్డ పుట్టిన మొదటి అరగంటలో తల్లులకు వచ్చే పాలను ముర్రుపాలు అంటారు. ఇవి కచ్చితంగా శిశువుకు పట్టించాలని సూచించారు. దీనివల్ల రోగ నిరోధక శక్తి పెరగడమే కాకుండా బిడ్డకు సమతుల్యమైన పోషకాహార పదార్థాలు లభిస్తాయని వివరించారు. అందులో మాంసకృతులు విటమిన్ ఏ ఉంటుందని గుర్తు చేశారు. వ్యాధులు రాకుండా ముర్రుపాలు బిడ్డను జీవితకాలం కాపాడుతుందని పేర్కొన్నారు. శిశువు పేగులను శుభ్రం చేసి మొదటి మలవిసర్జన కు తోడ్పడుతాయని స్పష్టం చేశారు. సహజంగా బిడ్డకు సరిపడా పాలు రావడంలేదని తల్లులు అనుకోవడం అపోహ మాత్రమేనని తెలిపారు. బిడ్డ పుట్టగానే పాలు మూడు నాలుగు రోజుల వరకు పడవని తేనె నాకించడము పంచదార నీళ్లు ఇవ్వటం గ్లూకోస్ నీళ్లు ఇవ్వటం చెయ్యకూడదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్స్ కవిత రేణుక తల్లులు హాజరైనారు.