మండల కేంద్రంలో వీధి కుక్కల బెడద అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని ప్రజల ఆవేదన

Published: Monday November 14, 2022
బోనకల్, నవంబర్ 13 ప్రజాపాలన ప్రతినిధి : వీధి కుక్కలు స్వైరవిహారం మండల కేంద్రంలో రోజురోజుకు ఎక్కువైతుంది. గ్రామంలో గుంపులుగా తిరుగుతూ దాడికి పాల్పడుతున్నాయి. కుక్కల దాడిలో గాయపడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. వీధి కుక్కల దాడికి పాల్పడిన వారిలో చిన్నపిల్లలే ఎక్కవగా ఉంటున్నారు. కుక్కల బెడద తగ్గించేందుకు వాటికి సంతాన నిరోధక శస్త్రకిత్స చేయడం, వ్యాధి నిరోధక టీకా వేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నా ఎక్కడా అమలైన దాఖలాలు లేవు. వీధికుక్కల సంఖ్యపై అధికారుల వద్ద సరైన లెక్కల్లేవు. కుక్కలు ఎనిమిది నెలల వయసులోనే సంతానోత్పత్తి శక్తి కలిగి ఉండడం, ఏడాదికి రెండు పర్యాయాలు సంతానోత్పత్తి చేసే అవకాశం ఉండడంతో వీటి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఒక కుక్క ఏడాదిలో 40 కి పైగా పిల్లలకు జన్మనిస్తుంది. వెటర్నరీ విభాగం అధికారులు శునకాల నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొంటున్నప్పటికీ ప్రజలకు కుక్క కాట్లు తప్పడం లేదు. గ్రామాల్లో కుక్కలకు టీకా వేయడం, సంతాన నిరోధక శస్త్ర చికిత్సచేయాలనేది ప్రభుత్వ లక్ష్యంగా ఉన్నప్పటికీ ఆచరణలో అమలుకు నోచుకోవడం లేదు. ఫలితంగా ప్రజలు కుక్కకాటుతో రేబిస్ వ్యాధి బారిన పడుతున్నారు.
 
వాహనాల వెంట సైతం..
 
గ్రామాల్లో రాత్రి వేళ కుక్కల బెడద అధికంగా ఉండి వాహనాలపై ప్రయాణించే సమయంలో వెంట పడుతున్నాయి. దీంతో వాహనదారులు కింద పడి గాయాలపాలైన ఘటనలు చాలా ఉన్నాయి. ద్విచక్ర వాహనదారుల వెంట వెంబడించి ప్రమాదాలకు గురవుతున్నారు. రోడ్డుపై పిల్లలు కనిపిస్తే వెంటపడి తరుముతున్నాయి. రోడ్డులో స్కూల్ వదిలిన సమయంలో పిల్లలు నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో విద్యార్థులపై కుక్కలు దాడులు చేస్తున్నాయి. ఈ కుక్కల దాడిలో విద్యార్థులకు గాయాలవుతున్నాయి. ఇలాంటి సంఘటనలతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ప్రజలు మండిపడుతున్నారు.
కుక్కల దాడిలో గాయపడిన వారు ప్రతినిత్యం హాస్పిటల్‌కు రావడం పరిపాటిగా మారింది. వీధి కుక్కలు కరువడంతో గాయాల బారిన పడినవారు చాలామంది ఉన్నారు. ఇకనైనా అధికారులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు స్పందించి వీధి కుక్కల బెడద లేకుండా ప్రజలు ఎవరు వీధి కుక్కల కాటుకు గురికాకుండా చూడాలని వేడుకుంటున్నారు.