ప్రతి వర్షపు నీటి చుక్కను వినియోగించడం కోసమే జలశక్తి అభియాన్ జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళిక

Published: Friday July 22, 2022
మంచిర్యాల బ్యూరో, జులై21, ప్రజాపాలన:
 
 
ప్రతి వర్షపు నీటి చుక్కను పొదుపు చేసి వినియోగించడం కోసం ప్రభుత్వం జలశక్తి అభియాన్ కార్యక్రమాన్ని చేపట్టిందని జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి అన్నారు. జలశక్తి అభియాన్ కార్యక్రమం క్రింద జిల్లాలో జరుగుచున్న పనుల పరిశీలనార్థం కేంద్ర బృందం సభ్యులు డిఫెన్స్ మంత్రిత్వ శాఖ సంచాలకులు ప్రీతమ్ సింగ్, సి.జి.డబ్ల్యు.డి. జియో హైడ్రాలజీ శాస్త్రవేత్త సుధీర్ కుమార్, జిల్లా అటవీ అధికారి శివాని డొంగ్రే, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి బి. శేషాద్రి లతో కలిసి గురువారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో జరుగుచున్న జలశక్తి అభియాన్ పనులను పరిశీలించేందుకు వచ్చిన కేంద్ర బృందం సభ్యులు ఈ నెల 21 నుండి 23 వరకు పనులను పరిశీలించి కేంద్రానికి నివేదిస్తారని తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన జలశక్తి అభియాన్ ఫైలట్ ప్రాజెక్టును దేశంలోని అన్ని జిల్లాలలో విస్తరించడం జరుగుతుందని తెలిపారు., మార్చి 2020 న దేశ వ్యాప్తంగా ఈ పథకం ప్రారంభించడం జరిగిందని, ఈ పథకం ద్వారా వర్షపు నీరు ఎప్పుడు, ఎక్కడ పడినా పొదుపు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. మిషన్ అమృత్ సరోవర్ పథకం క్రింద 76 వాటర్ బాడీసు అభివృద్ధి, పునఃరుద్దరణ చేయడం జరుగుతుందని, వివిధ శాఖల సమన్వయంతో 63 లక్షల మొక్కలు నాటడం జరుగుతుందని, అటవీ శాఖ ఆధ్వర్యంలో 41 మినీ- పెర్కొలేషన్, 13 పెర్కొలేషన్, 12 చెక్ డ్యామ్ నిర్మాణం, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నీటి వనరుల అభివృద్ధి చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. వివిధ రకాల నీటి పొదుపు కార్యక్రమాల క్రింద 4 వేల 117 పనులు మంజూరు కాగా 3 వేల 434 పనులు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. అనంతరం జలశక్తి అభియాన్ కార్యక్రమ నిర్వహణ, పనులపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి నరేందర్, జిల్లా పంచాయతీ అధికారి నారాయణ, జిల్లా పంచాయతీరాజ్, భూగర్భ జల శాఖ అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.