ఖాతాదారులను నిండా ముంచిన సహారా ఇండియా పై కేంద్ర సంస్థలు చర్యలు తీసుకోవాలి.

Published: Tuesday November 23, 2021

సత్వర  చెల్లింపులు చేపట్టి మదుపరులను ఆదుకోవాలి.

దేశంలో సెబీ, ఆర్‌బీఐ నిబంధ‌న‌ల‌ను పాటించ‌ని వివిధ సంస్థ‌ల అనుమ‌తుల‌ను స‌మ‌యానుసారంగా ర‌ద్దు చేస్తుంటారు. ఆర్థిక సంస్థ‌ల‌ను ప‌టిష్ట‌ప‌రిచేందుకు నిబంధ‌న‌ల‌ను అమ‌లుచేయ‌ని వాటికి మొద‌ట నోటీసులు జారీ చేసి త‌ర్వాత వివ‌ర‌ణ తీసుకుని సంతృప్తి చెంద‌ని సంద‌ర్భాల్లో మాత్ర‌మే ఆర్బీఐ త‌న కింద ప‌నిచేసే సంస్థ‌ల రిజిస్ట్రేషన్ల‌ను ర‌ద్దు చేస్తుంది. గత మూడు సంవత్సరాలుగా  నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు వినియోగదారులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నా  పట్టించుకోవడం లేదు. సహారా ఇండియా పలు కంపెనీల కింద కోటాను కోట్లు వసూలు చేసి దొంగకు తేలుకుట్టిన చందంగా వ్యవహరిస్తున్నది. 2018 నుండి ఖాతాదారులకు చుక్కలు చూపిస్తున్నారు. సంవత్సరానికి ఒక సారి సుబ్రతో రాయ్ గారు ప్రజలకు పత్రికల ద్వారా సందేశం తప్ప డబ్బు ఎప్పుడు ఇస్తాడో  తేల్చడు. ఎంబార్గో ఉంది, సెబీ ఉంది, రిజర్వ్ బ్యాంకు ఉంది అని కథలు చెబుతున్నారు. మీ డబ్బులు ఎక్కడికి పోవు, వారికి ఇంతటి విపత్కర పరిస్థితుల్లో కూడా వడ్డీ ఇస్తాము అంటున్నారే తప్ప ఎప్పుడు ఇస్తారు అని సమాధానం లేదు. సామాన్య ప్రజలు ఒకటి లేదా రెండు శాతం అధిక వడ్డీకి ఆశపడి సహారా లో పెట్టి నిరీక్షిస్తున్నారు. ఇప్పుడు భూమి మీద నూకలు చెల్లక ముందే తమ డబ్బు తమకు వస్తే చాలని అనుకుంటున్నారు. వీటిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలకు ఉపక్రమిస్తే సహకార రంగం, ఆర్థిక రంగం పుంజుకునే అవకాశం ఉంది లేకపోతే ఆర్థిక రంగం కూలిపోయే ప్రమాదం దగ్గరలోనే ఉన్నది. దేశంలో సుమారు మూడు కోట్ల మంది పెట్టుబడిదారుల నుండి సేకరించిన డబ్బును ఐచ్ఛికంగా పూర్తిగా కన్వర్టిబుల్ బాండ్ల (OFCD లు) ద్వారా తిరిగి చెల్లించాలని 2011లో సహారా ఇండియా రియల్ ఎస్టేట్ కార్పొరేషన్ లిమిటెడ్ (SIRECL) మరియు సహారా హౌసింగ్ ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (SHICL) ను సెబీ ఆదేశించింది. సుదీర్ఘ అప్పీళ్లు మరియు క్రాస్ అప్పీళ్ల ప్రక్రియ తరువాత, ఆగస్టు 31, 2012 న సుప్రీంకోర్టు సెబీ ఆదేశాలను సమర్థించింది, పెట్టుబడిదారుల నుండి సేకరించిన డబ్బును 15 శాతం వడ్డీతో తిరిగి చెల్లించాలని రెండు సంస్థలను కోరింది. పెట్టుబడిదారులకు మరింత వాపసు ఇవ్వడానికి సహారా చివరికి, 24,000 కోట్లను సెబీకి జమ చేయమని కోరింది, సహారా పెట్టుబడిదారులందరికీ తమ పెట్టుబడి మొత్తాన్ని పూర్తి వడ్డీతో పొందుతామని, ఒక రోజు ఆలస్యం అయినప్పటికీ అదనపు వడ్డీ చెల్లించబడుతుందని సుబ్రతో రాయ్ హామీ ఇచ్చి రెండు సంవత్సరాలు గడుస్తున్నా ఇంతవరకు చలనం లేదు. సహారాలో మదుపుదారులు చాల మంది డెబ్భై సంవత్సరాలు పై బడిన వారు ఎక్కువగా ఉన్నారు. రిటైర్ అయిన తరువాత వచ్చిన సొమ్మును  బ్యాంకు లో, పోస్టల్ లో తక్కువ వడ్డీ ఉండడంతో సహారలో ఇన్వెస్ట్ చేశారు. సహారా ఆఫిసులు తెరుచుకోవడం లేదు. స్థానికంగా ఉన్న కార్యాలయాలు మరియు హైదరాబాదు లో ఉన్న జోనల్ ఆఫిసు ఎప్పుడు మూసివేసి ఉంటుంది. ఎవరైనా ఆఫీసుకు వెళ్లి అడిగితే అక్కడ ఉన్న సిబ్బంది మూడు నెలలు వేచివుండండి, లేకపోతే రెన్యూ చేసుకోండి మంచి వడ్డీ వస్తుంది. కొంత మంది ఖాతాదారులు మృత్యువాత పడిన ఏమాత్రం కనికరం లేకుండా వ్యవహరిస్తున్నది. మెచ్యూరిటీ అయ్యి ఏండ్లు గడుస్తున్నా సరైన సమాధానం లేక మదుపరులు భయాందోళనకు గురవుతున్నారు. కావున సత్వరమే ప్రభుత్వం జోక్యం చేసుకొని ఖాతాదారులను ఇబ్బంది పాలు చేసిన సహారా యజమాన్యం పై మరియు స్థానిక కార్యాలయ సిబ్బందిని క్రిమినల్ కేసులు బనాయించి చర్యలకు ఉపక్రమించామని సహారా బాధితులు కోరుతున్నారు.