ప్రజలందరు ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన ఉండాలి : జిల్లా కలెక్టర్ నిఖిల

Published: Wednesday February 16, 2022
వికారాబాద్ బ్యూరో 15 ఫిబ్రవరి ప్రజాపాలన : మంగళవారం కలెక్టర్ కార్యాలయంలోని తన ఛాంబర్లో ఆర్థిక అక్షరాస్యత పోస్టరును ఆవిష్కరించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో ప్రజలకు ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కల్పించేందుకు ఈ నెల 15 నుండి 19 వరకు గో-డిజిటల్, గో-సెక్యూర్ అనే నినాదంతో ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజలు ఇట్టి కార్యక్రమాలలో పాల్గొని అవగాహన పెంపొందించు కోవాలని సూచించారు. లీడ్ బ్యాంకు జిల్లా మేనేజర్ రాంబాబు మాట్లాడుతూ, జిల్లాలోని ప్రతి వ్యక్తికి ఆర్థిక అక్షరాస్యత సందేశాలను అందించాలనే ఉద్యేశ్యంతో ఈ వారోత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.  జిల్లాలోని వికారాబాద్, తాండూర్, కొడంగల్, దోమ మరియు కోటపల్లి మండల కేంద్రాలలో ఆర్థిక అక్షరాస్యత కేంద్రాలను ఏర్పాటు చేశామని వెల్లడించారు. అవగాహన కార్యక్రమాలలో స్థానిక ప్రజా ప్రజనిధులు, అధికారులు పాల్గొని సహకరించాలని కోరారు.  తద్వారా ప్రజలకు సులభంగా బ్యాంకు డిజిటల్ సేవలు చేరువవుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ బి ఐ మేనేజర్ విజయ్ కుమార్, కనెరా బ్యాంకు మేనేజర్ సింగరాజు, యూనియన్ బ్యాంకు మేనేజర్ సర్ఫారాజ్, తెలంగాణ గ్రామీణ బ్యాంకు మేనేజర్ రామానుజ చారీ తదితరులు పాల్గొన్నారు.