రాజకీయ లబ్ది పొందడానికే వర్గీకరణను వాడుకున్నారు

Published: Friday February 26, 2021

ఎస్సీ కార్పోరేషన్ మాజీ చైర్మన్ మాదిగ జెఏసి వ్యవస్థాపకుడు డాక్టర్ పిడమర్తి రవి
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 25 ( ప్రజాపాలన ): వివిధ రాజకీయ పార్టీలు ఎదగడానికే వర్గీకరణ అంశాన్ని వాడుకొని లబ్దిపొందారని ఎస్సీ కార్పోరేషన్ మాజీ చైర్మన్ మాదిగ జెఏసి వ్యవస్థాపకుడు డాక్టర్ పిడమర్తి రవి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని బిజెఆర్ కూడలిలో మాదిగ జెఏసి జిల్లా అధ్యక్షుడు ఈదన్నోల్ల రాజు ఆధ్వర్యంలో మాదిగ జెఏసి రాష్ట్ర ఉపాధ్యక్షుడు తిమ్మని శంకర్ సమక్షంలో 12 శాతం రిజర్వేషన్ సాధనకై మాదిగల జాగృతి రథయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాదిగలు చేస్తున్న న్యాయ పోరాటం, బలిదానాలు రాజకీయ పార్టీల అధికార కాంక్షకు సంజీవనిలా మారిందని విమర్శించారు. మాదిగల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ కపట రాజనీతి గీతను దాటకుండా అడుగడుగునా అడ్డుతగులుతున్నారని పేర్కొన్నారు. మాదిగ జాతి న్యాయ పోరాటాలను బలిదానాలను చిన్నదిగా చేసి చూపడం అవివేకమని చెప్పారు. అగ్ర నీతి సూత్రాన్ని మాదిగ జాతిని జాగృతం చేసేందుకే రథయాత్ర లక్ష్యమని గుర్తు చేశారు. 26 ఏండ్లుగా మోసపోతున్న మాదిగ జాతిని మేల్పొల్సిన ఆవశ్యకత ఉందని తెలిపారు. రాష్ట్రంలో ఎస్సీ జనాభాలో కులాల వారిగా ఎవరి జనాభా ఎక్కువ ఉంటే వారికే వాటా దక్కాలని సూచించారు. ప్రజాస్వామ్య పద్ధతిలో 12 శాతం డిమాండ్ చేస్తూ మాదిగ జాతిని జాగృతం చేయుటకు ఫిబ్రవరి 18 నుండి మాదిగల జాగృతి రథయాత్రను ప్రారంభించామని పేర్కొన్నారు. మాదిగ జాతికి జరిగిన అన్యాయాన్ని ప్రజలకు వివరించాలనే లక్ష్యమని చెప్పారు. న్యాయమైన డిమాండ్ కు సంఘీభావం తెలపడం అభనందనీయమని కొనియాడారు. ఈ సమావేశంలో మాదిగ జెఏసి యూత్ రాష్ట్ర అధ్యక్షుడు సుందరం, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మర్పల్లి ఆనంద్, మాదిగ జెఏసి జిల్లా ఉపాధ్యక్షుడు సంజీవులు, పట్టణ అధ్యక్షుడు ప్రభు, మాదిగ జెఏసి నాయకులు మోమిన్‌పేట్‌ శేఖర్, సత్తయ్య, ఆనందం, సంజీవ, ప్రభాకర్, గొట్టిముక్కల ఆనందం తదితరులు పాల్గొన్నారు.