మధుమేహం వ్యాధి పట్ల జాగ్రత్త వహించాలి

Published: Wednesday December 07, 2022
మర్పల్లి మండల జెడ్ పిటిసి పబ్బె మధుకర్
వికారాబాద్ బ్యూరో 6 డిసెంబర్ ప్రజా పాలన : ఆరోగ్యాన్ని మించిన మహాభాగ్యం ఏది ఉండదని మర్పల్లి మండల జెడ్పిటిసి పబ్బె మధుకర్ అన్నారు. మంగళవారం మర్పల్లి మండల పరిధిలోని పట్లూరు గ్రామంలో మధుమేహానికి సంబంధించిన ఎన్ సి డి ( నాన్ కమ్యూనకబుల్ డిసీజ్ ) అసంక్రమిక వ్యాధుల కిట్ లను గ్రామ సర్పంచ్ దేవర దేశి ఇందిర అశోక్ అధ్యక్షతన మండల జెడ్పిటిసి పబ్బే మధుకర్ మండల ఎంపీపీ బట్టు లలిత రమేష్ ఎంపీటీసీ స్వప్న సురేష్ ఆరోగ్య విస్తరణ అధికారి తండోజు తిరుపతయ్యలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జెడ్పిటిసి పబ్బె మధుకర్ మాట్లాడుతూ చక్కెర వ్యాధి రక్తపోటు ఎక్కువైనా తక్కువైనా ప్రాణాంతకం అవుతుందని హెచ్చరించారు. శారీరక రుగ్మతలలో ఏదైనా అనుమానం వచ్చినట్లయితే వెంటనే వైద్యున్ని సంప్రదించాలని సూచించారు. 33 ఎన్సీడీ కిట్లను మధుమేహ వ్యాధిగ్రస్తులకు పంపిణీ చేశామని తెలిపారు. 9 మంది చక్కెర వ్యాధిగ్రస్తులు, 17 మంది రక్తపోటు వ్యాధిగ్రస్తులు, ఏడుగురు చక్కెర రక్తపోటు వ్యాధిగ్రస్తులు ఉన్నారని వివరించారు. ఆరోగ్య విస్తరణ అధికారి తండోజు తిరుపతయ్య మాట్లాడుతూ ప్రస్తుతం ఎక్కువ మంది ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య మధుమేహం అని అన్నారు. ఇది అత్యంత ప్రమాదకారి కానప్పటికీ.. షుగర్ మితిమీరితే ప్రాణాలకే ప్రమాదమని హెచ్చరించారు. శరీరంలోని గ్లూకోజ్ హెచ్చు తగ్గుల వల్ల ఈ వ్యాధి వస్తుందని వివరించారు. షుగర్ వ్యాధి నుంచి తప్పించుకోవాలంటే మాత్రం సరైన డైట్ ఖచ్చితంగా పాటించాలని స్పష్టం చేశారు. మధుమేహం వచ్చిన కూడా చాలా ఏండ్లు బ్రతికే వాళ్లు ఉన్నారని గుర్తు చేశారు. దానికి కారణం వాళ్లు తీసుకునే ఆహార జాగ్రత్తలే కారణమని వెల్లడించారు. ఆహార నియమాలే వీళ్ల ఆరోగ్యాన్ని సురక్షితంగా ఉంచుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ వ్యాధిని ఆదిలోనే  గుర్తిస్తే దీని బారి నుంచి తప్పించుకోవచ్చని భరోసా కల్పించారు. పట్లూరు గ్రామ సర్పంచ్ దేవర దేశి ఇందిర అశోక్ మాట్లాడుతూ జీవనశైలిలో మార్పులు చేసుకొని సరియైన వ్యాయామం చేయాలని సూచించారు. ఆహారములో మార్పులతో నియంత్రణలో వుంచుకోవచ్చునని తెలిపారు. గ్రామంలో లభించే తాజా ఆకుకూరలను రోజు వినియోగించుకోవాలని స్పష్టం చేశారు. పౌష్టిక ఆహారం తీసుకునే ప్రయత్నం ప్రతి ఒక్కరు చేయాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ స్వప్న సురేష్ పీహెచ్ఎన్ పుష్పలత హెచ్ ఎస్ అమరేశ్వరి ఏఎన్ఎం స్నేహలత పట్లూరు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.