ఉద్యోగాల భర్తీ కై చలో పార్లమెంట్ ముట్టడి ** జిల్లా నుండి బయలుదేరిన నాయకులు ** డివైఎఫ్ఐ జిల్లా

Published: Thursday November 03, 2022
ఆసిఫాబాద్ జిల్లా నవంబర్ 02 (ప్రజాపాలన, ప్రతినిధి) : దేశవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ రంగ సంస్థలలో ఖాళీలను గుర్తించి తక్షణమే నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ నేడుగురువారం 3న చలో పార్లమెంట్ ముట్టడిని విజయవంతం చేయాలని, ఆసిఫాబాద్ జిల్లా నుండిడివైఎఫ్ఐ నాయకులు బుధవారం బయలుదేరారు. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గోడిసెల కార్తీక్ మాట్లాడుతూ కరోనా మహమ్మారితో వివిధ ప్రైవేట్ రంగాలలో సుమారు 56 లక్షల మంది ఉద్యోగ యువత ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. వివిధ ప్రభుత్వ రంగ సంస్థలలో సుమారు 10లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని నేటి వరకు వాటిని భర్తీ చేయకపోవడం సిగ్గుచేటు అని విమర్శించారు. ఉపాధి అవకాశాలు రాకపోవడం వల్ల నిరుద్యోగ యువత ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నారు. అందుకే దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ సంస్థలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని చలో పార్లమెంట్ ముట్టడి కార్యక్రమాన్ని డివైఎఫ్ఐ నిరుద్యోగ యువతీ యువకులకు దేశవ్యాప్తంగా పిలుపునిచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు బొర్కుటే శ్యామ్ రావు, జిల్లా నాయకులు సతీష్, నిఖిల్, పురుషోత్తం, తిరుపతి, ఆకాష్, తదితరులు పాల్గొన్నారు.