భగత్ సింగ్ స్ఫూర్తితో విద్యార్థులు, యువత, ముందుకు నడవాలి

Published: Thursday March 24, 2022
నస్పూర్, మార్చి 23, ప్రజాపాలన ప్రతినిధి : భగత్ సింగ్ స్ఫూర్తితో విద్యార్థులు యువత ముందుకు నడవాలని భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు మిట్టపల్లి తిరుపతి అన్నారు. బుధవారం నస్పూర్ మండల కేంద్రంలోని సింగరేణి ప్రభుత్వ సెంకండరీ పాఠశాలలో  భగత్ సింగ్ 91వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్న వయసులోనే దేశం కోసం పోరాడి ప్రాణాలర్పించిన గొప్ప వ్యక్తి భగత్ సింగ్ అని అన్నారు. మా దేహం ముక్కలైనా ఈ దేశాన్ని ముక్కలు కానివ్వం అనే నినాదంతో బ్రిటిష్ వారిపై దండయాత్ర చేసిన గొప్ప వ్యక్తి భగత్ సింగ్ అన్నారు. భగత్ సింగ్ అంచనా ప్రకారం గాంధీకి సామ్రాజ్యవాదం పట్ల వ్యతిరేకత కంటే విప్లవం పట్ల భయమే ఎక్కువ. హేతువాదీ, నాస్తికుడూ అయిన భగత్ సింగ్ లాగా మతవాదానికి గాంధీ వ్యతిరేకి కాడు. అలాంటి గాంధీనే సహించలేక హత్య గావించిన వారి వారసులు నేడు అధికారంలో వున్నారని అన్నారు. భగత్ సింగ్ ఆశయాల సాధన కోసం ప్రతీ ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు శ్రావణ, శ్రీకాంత్, విష్ణు, సంజయ్ తదితరులు పాల్గొన్నారు.