పోడు భూములకు పట్టాలు ఇవ్వాలి ఆదివాసి గిరిజన సంఘం మండల అధ్యక్షుడు ఎస్ కె అబ్దుల్లా

Published: Thursday October 06, 2022
జన్నారం, అక్టోబర్ 04, ప్రజాపాలన: ఆదివాసి గిరిజనులు పోడు చేసుకొని సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు ఇవ్వాలని ఆదివాసి గిరిజన సంఘం జన్నారం మండల అధ్యక్షుడు ఎస్.కె అబ్దుల్లా అన్నారు. మంగళవారం మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలోని ఆదివాసీ గిరిజన సంఘం కార్యాలయంలో మండలంలోని ధర్మారం, బాదంపల్లి, రాయికుంట,  గోండు గుడా, తపాలాపూర్, గడ్డం గుడా, తదితర గిరిజన గుడాలకు చెందిన పలువురు గిరిజనులకు ఆదివాసి గిరిజన సంఘం కండువా కప్పి సంఘంలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఆదివాసీలు గతంలో పోడు చేసుకొని ప్రస్తుతం సాగు చేసుకుంటున్నా భూములకు వెంటనే పట్టాలు ఇవ్వాలన్నారు .లేకుంటే ఎక్కడ ఖాళీ స్థలం ఉంటే అక్కడ భూమిని కబ్జా చేస్తామని హెచ్చరిస్తున్నామన్నారు. అలాగే గ్రామాల్లో పేద ప్రజలకు ఇంటి స్థలంతో పాటు డబుల్ బెడ్రూం ఇల్లు నిర్మించి ఇవ్వాలన్నారు. ఇంటి స్థలం ఉన్నవారికి ఐదు లక్షల 50వేల రూపాయలను మంజూరు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఆదివాసి హక్కులను సాధించుకోవాలంటే ఆదివాసీ గిరిజన సంఘాన్ని మరింత బలం పేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. అందుకు ప్రతి గిరిజనులు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కనికరం అశోక్, బీడీ, సిగార్ యూనియన్ జన్నారం మండల కార్యదర్శి కూకటికారి బుచ్చయ్య, వ్యవసాయ కార్మిక సంఘం జన్నారం మండల అధ్యక్షుడు రాజన్న, వివిధ గ్రామాలకు చెందిన ఆదివాసి గిరిజనులు పాల్గొన్నారు.