త్వరలో సమీకృత కలెక్టరేట్ భవనం ప్రారంభం దిశగా చర్యలు జిల్లా కలెక్టర్ భారతి హోళ్లికేరి

Published: Monday December 12, 2022
మంచిర్యాల బ్యూరో, డిసెంబర్ 11, ప్రజాపాలన :
 
 
 జిల్లాలో నిర్మిస్తున్న కలెక్టరేట్ భవనాన్ని త్వరలో ప్రారంభించేందుకు తగు చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ భారతి హోళ్లికేరి అన్నారు. ఆదివారం జిల్లాలోని నస్పూర్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన కలెక్టర్ క్యాంపు కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ దంపతులు జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్, ట్రైనీ కలెక్టర్ గౌతమి, పెద్దపల్లి జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) కుమార్ దీపక్, డి.సి.పి. అఖిల్ మహాజన్, బెల్లంపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు దుర్గం చిన్నయ్యతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ త్వరలోనే సమీకృత కలెక్టరేట్ భవన సముదాయాన్ని ప్రారంభించి అన్ని ప్రభుత్వ శాఖల సంబంధిత సేవలను ఒకే చోట ప్రజలకు అందించే విధంగా చర్యలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వం ప్రజల సౌకర్యార్థం ప్రభుత్వ సేవలను సులభతరం చేసేందుకు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమీకృత కలెక్టరేట్ భవన సముదాయాల ద్వారా అన్ని ప్రభుత్వ శాఖల సేవలు ఒకే చోట లభ్యమవుతాయని, అన్ని ప్రభుత్వ శాఖలు ఒకే ప్రదేశంలో అందుబాటులో ఉండడంతో ప్రజలకు వ్యయ ప్రయాసలు తగ్గడంతో పాటు సమస్యల పరిష్కారం, సేవలు వేగవంతంగా అందుతాయని తెలిపారు. నిర్మాణ దశలో ఉన్న సమీకృత కలెక్టరేట్ భవనాన్ని త్వరలోనే ప్రారంభించేందుకు అన్ని శాఖల సమన్వయంతో చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రేణికుంట్ల ప్రవీణ్ కుమార్, మంచిర్యాల మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య, నస్పూర్ మున్సిపల్ చైర్మన్ ప్రభాకర్ సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.